గిచ్చటం, లాఠీ చార్జ్ చెయ్యటం ..15 గంటలు తిప్పటం... పోలీసుల తీరుపై మండిపడిన గల్లా
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బెయిల్ పై విడుదల అయిన తరుణంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తుళ్ళూరులో రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆయనను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక నేడు జైలు నుండి బయటకు వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .
ఉగ్రవాదుల, నక్సలైట్లు కాదు., రైతులపై ఇంత దారుణమా?: గల్లా జయదేవ్, జగన్పై నాదెండ్ల ఫైర్
తనపై పోలీసుల దౌర్జన్యం చేశారన్న ఎంపీ గల్లా జయదేవ్
రాజధాని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన తనపై పోలీసుల దౌర్జన్యం చేశారంటూ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. బెయిల్ పై గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ, తనను గోళ్లతో రక్కేశారని, చొక్కా చించేశారని తుళ్ళూరు మహిళలు తనను చాలా వరకు కాపాడారని ఆయన తనపై జరిగిన దాడిని తెలియజేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బట్టలు కూడా ఊడిపోయాయని వెల్లడించారు.
15 గంటలపాటు ఎక్కడెక్కడో తిప్పారని చెప్పిన గల్లా
దాదాపు 15 గంటలపాటు ఎక్కడెక్కడో తిప్పారని చెప్పిన గల్లా జయదేవ్ మమ్మల్ని అరెస్ట్ చేశారా, నిర్బంధించారా అంటే పోలీసులు సమాధానం చెప్పలేదని మండిపడ్డారు . కనీసం వైద్య సాయాన్ని కూడా అందించలేదని ఆయన పేర్కొన్నారు . ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇక తన అరెస్ట్ పర్వాన్ని ఉద్దేశించి ముందు నరసరావుపేట పీఎస్ లోనే మూడు గంటల పాటు ఉంచారని , స్టేషన్ బయట జనాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రొంపిచెర్ల తీసుకెళ్లారని పేర్కొన్నారు .
గుంటూరు జిల్లా అంతా తిప్పుతూనే ఉన్నారని ఆగ్రహం
అక్కడ మరో రెండు గంటలు ఉంచారు. ఇక అక్కడి నుంచి తరలించి గుంటూరు జిల్లా అంతా తిప్పారని ఆయన పేర్కొన్నారు . కాకాని వద్ద మరో నాలుగు గంటలు ఆపేశారని ఆయన చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మొదలుపెడితే 15 గంటలు తిప్పి తిప్పి అరెస్ట్ చేశారని, అప్పటివరకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో, నిర్బంధిస్తున్నారో కూడా చెప్పలేదని గల్లా ఆవేదన వ్యక్తం చేశారు. . ఒక ఎంపీతో ఇలా వ్యవహరించారని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు గల్లా .

మహిళలు చెప్తే నమ్మలేదు పుండ్లు పడేలా గిచ్చుతున్నారన్న ఎంపీ
మొన్న రాజధాని మహిళలు తమను పోలీసులు గిచ్చుతున్నారని చెబితే ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడర్థమైంది ఎంతగా టార్చర్ చేస్తున్నారో అని పేర్కొన్నారు. మామూలుగా గిచ్చడం కాదు, పుండ్లు పడేట్టు గిచ్చుతున్నారన్నారు గల్లా . ఇలా చేస్తోంది పోలీసులు కాదు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో చేయిస్తున్నారని పేర్కొన్నారు . వాళ్లు కేంద్ర బలగాలకు చెందినవాళ్లు కాబట్టి వారిపై యాక్షన్ తీసుకోలేమని చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
తుళ్ళూరు మహిళలు తనను కాపాడారన్న గల్లా
శాంతియుతంగా ఉద్యమించేందుకు ప్రయత్నించినా, పోలీసులే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయారని వారిపై రాళ్లు వేశామని ఆరోపణలు చేస్తూ వాళ్లపై వాళ్లే అటాక్ చేసుకుని అక్కడినుంచి లాఠీచార్జి చేయడం మొదలుపెట్టారన్నారు . మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణ లేకుండా కొట్టారని ఆయన పేర్కొన్నారు .లాఠీచార్జి మొదలవగానే నేను ఉన్నచోటనే కూర్చున్నాను. నా చుట్టూ తుళ్లూరు మహిళలు రక్షణ కవచంలా నిలుచున్నారని తనను మహిళలు కాపాడారని చెప్పారు గల్లా .
ఎస్పీ విజయరావు తీరుకు భయపడ్డానన్న ఎంపీ
ఇంతలోనే ఎస్పీ విజయరావు నావైపు లాఠీతో దూసుకురావడంతో భయమేసిందన్న గల్లా అయితే ఆయన నా వద్దకు వచ్చి లాఠీ పక్కనే ఉన్న పోలీసుకు ఇచ్చేశారని పేర్కొన్నారు . ఇక్కడ మీరు ఉండకూడదు అంటూ నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నాతో పాటు కొందరు నేతలు కూడా వస్తామంటే వారిని కూడా జీపెక్కించారు. ఇక అక్కడ నుండి అర్ధం కాని రీతిలో పోలీసులు తనను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించారు.