ఆత్మహత్యకు పాల్పడిన మహిళను కాపాడి మానవత్వం చాటుకున్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఆత్మహత్యాయత్నం విరమించుకోవాలని, వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆ మహిళ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన మహిళను అడ్డుకున్న ఎమ్మెల్యే ముస్తఫా
పూర్తి వివరాల్లోకి వెళితే మణిపురం ఫ్లైఓవర్ పై శ్రీనివాస రావు పేట కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన మహిళను అడ్డుకున్న స్థానికులు ఎంత చెప్పినా ఆమె వినిపించుకోకుండా ఫ్లైఓవర్ పై నుండి కిందికి దూకే ప్రయత్నం చేసింది. అయితే ఆ దారిలో ఇంటికి వెళుతూ సదరు మహిళను గమనించిన ఎమ్మెల్యే ముస్తఫా, తన కారును ఆపి మహిళకు సర్దిచెప్పారు.

మహిళ సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
ఆ మహిళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని సదరు వివాహిత ఎమ్మెల్యేకు చెప్పారు. ఆమెను సముదాయించి ఆమె సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చావే అన్నిటికీ మార్గం కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. ధైర్యంగా బ్రతకాలని, కష్టాలు ఎవరికీ కలకాలం ఉండవని ఎమ్మెల్యే చెప్పారు. ఆమె సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా మహిళలు తన కారులో ఎక్కించుకొని ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. మహిళ ప్రాణాలు కాపాడినందుకు ఎమ్మెల్యే ముస్తఫాను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

పెరుగుతున్న ఆత్మహత్యలు, మహిళను సమయానికి కాపాడిన ఎమ్మెల్యే
ఇటీవల కాలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో, రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను బట్టి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మహత్యకు కారణాలు ఏమైనా, ఆత్మహత్యకు పాల్పడ్డారని నిర్ణయం తీసుకున్న వారిని, ఆ సమయంలో ఎవరైనా విరమింపజేస్తే మళ్ళీ వారు ఆత్మహత్య ఆలోచన చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సమయానుకూలంగా అదే పని చేశారు. ఈ క్రమంలోనే సదరు మహిళ ఆత్మహత్యాయత్నం విరమించుకుని ఇంటికి వెళ్ళింది.

గతంలో ప్రజల కోసం రోడ్లపై గుంతలు పూడ్చిన ఎమ్మెల్యే
గతంలోనూ ఓ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని చూడడమే కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. గుంటూరు నగరంలో రద్దీగా ఉండే కాకాని రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను ఆర్అండ్ బీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగి తాపీ పట్టుకొని మరమ్మతులు చేసి మరీ గుంతలను పూడ్చారు. ఇక తాజాగా మహిళ ప్రాణాలు కాపాడి, ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు.