ఏపీలో ఐపీసీ సెక్షన్ లు కాదు వైసిపి సెక్షన్లు అమలు అవుతున్నాయి.. ఇది పోలీసు రాజ్యం .. టీడీపీ ఫైర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. టిడిపి నేతల అరెస్టులపై టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. కాడి పట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసిన రైతు ద్రోహిగా ఏపీ సీఎం జగన్ రెడ్డి మిగిలిపోయారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జైల్ భరోకు వెళ్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు .

జగన్ కు తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ఏం చేయాలో అర్థం కాకే ఇదంతా : అచ్చెన్నాయుడు
గుంటూరు జైలు భరో పిలుపుతో ప్రభుత్వ పునాదులు కదిలాయి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ లు కాదు వైసిపి సెక్షన్లు అమలు అవుతున్నాయని అచ్చెన్న మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని అచ్చెన్నాయుడు సూచించారు. రాజధాని రైతుల పోరాటం చేస్తుంటే, రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పెయిడ్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతు రాజ్యం అంటే ప్రశ్నించిన రైతులకు బేడీలు వేయటమా అని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల పై పగ ప్రతీకారాలకు జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, జగన్ కు తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ఏం చేయాలో అర్థం కావడం లేదని విమర్శించారు అచ్చెన్నాయుడు.

సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను మోదీకి తాకట్టు పెడుతున్నారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి
మరోవైపు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈరోజు గుంటూరు జైల్ భరో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న తీరు నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. అమరావతి పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను మోదీకి తాకట్టు పెడుతున్నారని అందుకే కేంద్రంతో రాజీ పడి పోలవరం ప్రాజెక్టును తుంగలో తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

ఇది అప్రజాస్వామికం , నిరంకుశత్వం : వర్ల రామయ్య
రాజధాని రైతులపై అక్రమ కేసులు, చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేయడం వంటి ఘటనలపై వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత రైతులను పరామర్శించడానికి బయలుదేరిన వర్ల రామయ్య ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు . ఇది అప్రజాస్వామికమని, నిరంకుశ పాలనకు నిదర్శనమని, ఏపీ ప్రభుత్వ అరాచకమని వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న పరిపాలన అంటూ ధ్వజమెత్తారు వర్లరామయ్య. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ మండిపడ్డారు .

ఏ రాష్ట్రాల్లోనూ ఏపీలోలా అణచివేత లేదు : యనమల రామకృష్ణుడు
టిడిపి నాయకుల హౌస్ అరెస్టులను ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు . శాంతియుతంగా చేస్తున్ననిరసనలు అడ్డుకోవడం గర్హనీయం అంటూ యనమల మండిపడ్డారు అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ ప్రశ్నించిన యనమల రామకృష్ణుడు ఏ ఇతర రాష్ట్రాల్లో లేని అణచివేత ఏపీలో మాత్రమే కొనసాగుతుంది అంటూ నిప్పులు చెరిగారు. ఆందోళనకు దరఖాస్తు చేసిన అనుమతులు ఇవ్వడం లేదంటూ ధ్వజమెత్తిన ఆయన అక్రమ గృహ నిర్భందాలు అప్రజాస్వామికమంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు : నక్కా ఆనంద్ బాబు
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని టిడిపి నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏపీ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు . మాజీ మంత్రి నక్కా ఆనందబాబు రైతుల అరెస్ట్ వ్యవహారంలో కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు అని రైతులను అరెస్టు చేయించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన డిఎస్పి ని సస్పెండ్ చేయాలని కోరారు. రాష్ట్రంలోనే దళితులపైన అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి ఉందని నక్క ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.