గుంటూరులో దారుణం... రూ.50 కోసం తలెత్తిన వివాదం... బలైపోయిన యువకుడు..
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రూ.50 విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి ఏకంగా ఒకరి ప్రాణాన్నే బలిగొన్నది. ఆ ఒక్కడి పైనే ఆధారపడ్డ అతని కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైంది. భర్త లేకుండా ఇద్దరు చంటిబిడ్డలతో తానెలా బతకాలని అతని భార్య రోధించడం స్థానికులను కలచివేసింది. అతని మృతికి కారణమైనవారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... సత్తెనపల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో నివసించే షేక్ బాజి(27)కి భార్య సైదాబి,పిల్లలు అహిల్(3),అమీర్(1)లు ఉన్నారు. కుటుంబాన్ని పోషించడం కోసం స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణంలో బాజి పనిచేస్తున్నాడు. అలాగే రాత్రిపూట ఓ మిల్క్ డైరీలో పనిచేస్తున్నాడు. 15 రోజుల క్రితం బాజి మద్యం షాపులో ఉన్న సమయంలో పల్లపు కోటివీరయ్య అనే వ్యక్తి మద్యం షాపుకు వచ్చాడు. తనకు కావాల్సినవి తీసుకుని రూ.50 ఫోన్ పే చేశాడు. అయితే సాంకేతిక కారణాలతో ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన ఆ నగదు బదిలీ కాలేదు.

వీరయ్య సోదరుడిని అడిగిన బాజి...
మరుసటిరోజు ఉదయం వచ్చి ఆ డబ్బు చెల్లిస్తానని చెప్పి వీరయ్య అక్కడినుంచి వెళ్లిపోయాడు. కానీ వీరయ్య మళ్లీ అటువైపు రాలేదు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం బాజికి వీరయ్య తమ్ముడు నాగేశ్వరరావు ఓచోట కనిపించడంతో ఈ విషయం చెప్పాడు. వీరయ్య చెల్లించాల్సిన రూ.50 అతన్ని చెల్లించాలని అడిగాడు. మంగళవారం(జనవరి 19) మరోసారి నాగేశ్వరరావు బాజికి కనిపించడంతో మళ్లీ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో నాగేశ్వరరావు కోపంగా రూ.50 నోటు ఇచ్చి వెళ్లిపోయాడు.

ఘర్షణ... బాజిపై దాడి... ఆస్పత్రిలో మృతి
బుధవారం(జనవరి 20) రాత్రి కోటి వీరయ్య మద్యం దుకాణం వద్దకు వచ్చి తన తమ్ముడిని ఎందుకు డబ్బులు అడిగావని బాజిని నిలదీశాడు. అతనితో మాట్లాడేందుకు బాజి దుకాణం నుంచి బయటకు వెళ్లాడు. కోటివీరయ్య వెంట ఉన్న నాగేశ్వరరావు,తిరుమలేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దాడిలో గాయపడ్డ బాజిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అతను బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.బాజి మరణంతో అతని భార్య సైదాబి తీవ్రంగా రోధించింది. ఇద్దరు చంటిబిడ్డలతో ఒంటరిగా ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేసింది. సైదాబి రోధించిన తీరు అక్కడివారిని తీవ్రంగా కలచివేసింది.