ఎమ్మెల్యే రజనీకి హైకోర్టు షాక్ .. హెచ్ఎంపై సస్పెన్షన్ ఎత్తివేత
ఏపీ హైకోర్టు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి షాక్ ఇచ్చింది. చిలకలూరిపేట శారదా హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మిపై విడదల రజని ఫిర్యాదుతో ఉన్నతాధికారులు వేసిన సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది. గత నెలలో విడదల రజనీ ఫిర్యాదుతో హెచ్ ఎం ధనలక్ష్మీమీద సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.
స్కూల్ కమిటీ నియామక వివాదంలో జోక్యం చేసుకున్న విడదల రజని హెచ్ఎం ధనలక్ష్మిని కమిటీని రద్దు చేయాలని చెప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎమ్మెల్యే రజని ఆగ్రహానికి కారణమయ్యాయి. శారదా హైస్కూల్ కమిటీ నియామకంపై గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న క్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కమిటీని రద్దు చేయాలని ప్రధాన ఉపాధ్యాయురాలు ధనలక్ష్మికి ఫోన్ చేశారు.

కమిటీ రద్దు కు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయాన్ని కమిటీ ముందు చర్చించిన ధనలక్ష్మి, ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని, తనకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఫోన్ సంభాషణను కమిటీకి వినిపించారు. ఇక దీంతో తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి కమిటీకి వినిపించడంపై, ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన ఉపాధ్యాయురాలు ధనలక్ష్మిపై విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే రజని ఫిర్యాదు అందుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు అక్టోబర్ నెలలో ధనలక్ష్మి ని సస్పెండ్ చేస్తూ, ఆమెపై వేటు వేశారు. తనపై సస్పెన్షన్ ను సవాలు చేస్తూ ధనలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఇక దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం,ధనలక్ష్మి పై ఉన్న సస్పెన్షన్ ఉత్తర్వులను ఎత్తివేసింది. దీంతో ఎమ్మెల్యే రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చినట్లయింది. సస్పెన్షన్ ఎత్తివేతతో ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మికి ఊరట లభించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!