వైఎస్సార్ విగ్రహానికి పేడపూసి అవమానం , టీడీపీ పనే అంటూ వైసీపీ కార్యకర్తల ఆందోళన ,ఉద్రిక్తత
గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగింది. పొన్నూరు మండలం వల్లభరావుపాలెం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహానికి గుర్తుతెలియని కొందరు దుండగులు పేడ పూసి అవమానించారు. వైఎస్సార్ విగ్రహాన్ని మలినం చేశారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో వైయస్ఆర్ విగ్రహానికి అవమానం చేయడం వైసీపీ శ్రేణులను ఆవేదనకు గురి చేస్తుంది. కొందరు కావాలని వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ఈ తరహా పనులు చేస్తున్నారని వైయస్సార్ అభిమానులు చెప్తున్నారు.
ఆదాయం కోసం వేట మొదలెట్టిన సీఎం జగన్ .. ఎర్రచందనం , మైనింగ్ పై ఫోకస్, కీలక ఆదేశాలు

వైఎస్సార్ విగ్రహానికి పేడ పూసి అవమానం .. పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఫిర్యాదు
తమ దేవుడు, అభిమాన నాయకుడైన వైయస్సార్ కు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆయన అభిమానులు చెబుతున్నారు. గతంలోనూ వైయస్ జగన్మోహన్ రెడ్డిని సైతం అవమానించారని చెప్పారు. వైఎస్సార్ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విగ్రహాన్ని శుభ్రం చేయించారు.

విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తల ఆందోళన .. టీడీపీ పనే అంటూ ఆరోపణ
కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనకు బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. కొందరు ఇది టీడీపీ నేతలు చేసిన పనిగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన విరమించారు . ఒకపక్క రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కావాలనే ఇదంతా చేస్తున్నట్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్రామంలో ఉద్రిక్తత .. మొదటి విడత ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం
దీంతో ప్రస్తుతం వల్లభరావు పాలెంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భద్రత ఏర్పాటు చేశారు.
వల్లభరావు పాలెం గ్రామం టీడీపీకి పట్టున్న గ్రామం. ఇటీవల జరిగిన పంచాయితీ మొదటి విడత ఎన్నికల్లో సైతం టిడిపి బలపరిచిన అభ్యర్థి స్వల్ప మెజారిటీతో పంచాయతీని కైవసం చేసుకుంది. దీంతో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మలినం చేసింది టిడిపినే అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.

వైసీపీ కార్యకర్తలు తమకు ప్రాణభయం ఉందని ఆవేదన
టిడిపి బలపరిచిన అభ్యర్థి పాలనలో 5 సంవత్సరాలు ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు విగ్రహానికే రక్షణ లేదని , ఈ గ్రామంలో తమకు సైతం ప్రాణభయం ఉందంటూ, తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న స్థానిక వైసీపీ నాయకులు పోలీసులు చర్య తీసుకోవాలని కోరుతున్నారు.