ఆ ఆడియో నాదికాదు .. అదంతా మార్ఫింగ్.. వారివెనుక ఓ నేత .. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్న ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు సాగిస్తున్నారు .ఇదే సమయంలో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాజీ అనుచరుడు సందీప్ ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేయడంతో పాటుగా, ఉండవల్లి శ్రీదేవి కి చెందిన ఒక ఆడియో సంభాషణ లీక్ చేశారు.
ఉండవల్లి శ్రీదేవి ఆడియో కలకలం ..ఎమ్మెల్యేగా అనర్హురాలని టీడీపీ నేత అనిత ఆగ్రహం

శ్రీదేవి ఆడియో దుమారం .. ఏపీలో పేకాటపై పెద్ద చర్చ
ఉండవల్లి శ్రీదేవి, సందీప్ ల మధ్య జరిగిన ఆడియో సంభాషణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఉండవల్లి శ్రీదేవి పేకాటను ప్రోత్సహిస్తున్నారని, అందులో పేకాట క్లబ్ ల నిర్వహణపై ఆమె పర్సంటేజ్ ల విషయంపై వైసిపి బహిష్కృత కార్యకర్త సందీప్ తో గతంలో చర్చించిన విషయాలు ఉన్నాయి. అయితే ఆ ఆడియో రాష్ట్రంలో దుమారంగా మారగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆడియో విషయం పై స్పందించారు .తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.

తన వాయిస్ అయితే పోలీసులకు ఇవ్వాలన్న శ్రీదేవి
సందీప్ విడుదల చేసిన ఆడియో లో ఉన్న వాయిస్ తనది కాదని, తాను సందీప్ తో అలా ఎప్పుడూ మాట్లాడలేదని శ్రీదేవి పేర్కొన్నారు. ఒకవేళ ఆడియో లో వాయిస్ తనదే అయితే పోలీసులకు ఇవ్వాలని సూచించారు. కావాలని తన వాయిస్ ను మార్పింగ్ చేసి తన ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి మండిపడుతున్నారు. వారిద్దరి వెనక ఒక నేత ఉండి నడిపిస్తున్నారని పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు శ్రీదేవి.

అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానంతో టెస్టింగ్ కు కూడా సిద్ధమన్నఎమ్మెల్యే
అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానంతో టెస్టింగ్ కు కూడా సిద్ధమని చెప్పిన శ్రీదేవి , తనపై వస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు కూడా వెనుకాడబోనని శ్రీదేవి అంటున్నారు. ఒకపక్క శ్రీదేవి వైసిపి బహిష్కృత నేతల లో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేస్తుంటే, మరోపక్క శ్రీదేవి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ బహిష్కృత నేతలు లబోదిబోమంటున్నారు.

వైసీపీ బహిష్కృత కార్యకర్తల వెనుక ఉన్న నేత ఎవరు ?
డబ్బులు ఇప్పించి తిరిగి చెల్లించమని అడిగితే ఎమ్మెల్యే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇన్సైడర్ ట్రేడింగ్ పై కోర్టుకు వెళ్లిన తమను కేసులు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువస్తున్నారని, టిడిపి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది . ఎమ్మెల్యే వ్యాఖ్యలతో వారి వెనుక ఉన్న ఆ నేత ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.