జగన్ రెడ్డికి విధ్వంసం కిక్ ఇస్తుందన్న లోకేష్ .. కూల్చివేతలు వికృత చేష్టలన్న చినరాజప్ప
బాలకృష్ణ అల్లుడు టిడిపి నాయకుడు భరత్ కు సంబంధించిన గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై టీడీపీ భగ్గుమంటోంది. గీతం కూల్చివేతలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతోపాటు పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గీతం యూనివర్సిటీలో జీవీఎంసీ అధికారుల కూల్చివేతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భరత్ కు తోడల్లుడు నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . కూల్చివేతల రాక్షసానందానికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు.

రాజకీయ కక్షలో భాగమే గీతం కూల్చివేతలు .... లోకేష్ ఫైర్
సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు కిక్ ఇస్తే, జగన్ రెడ్డికి విధ్వంసం కిక్ ఇస్తుందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా యూనివర్సిటీలో యుద్ధవాతావరణం సృష్టించారని ఫైర్ అయిన నారా లోకేష్ మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇల్లు, ఈరోజు గీతం యూనివర్సిటీ అంటూ ట్వీట్ చేశారు.

పడగొట్టటం తప్ప నిలబెట్టటం రాదన్న లోకేష్
కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సేవలందించింది గీతం వైద్య కళాశాల అని పేర్కొన్న నారాలోకేష్ ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీ పై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతుందని లోకేష్ ఫైర్ అయ్యారు. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పని చేస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.

కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్టుల లక్ష్యంగా ఏపీ లో జగన్ పాలన.. చినరాజప్ప
గీతం యూనివర్సిటీలో కూల్చివేతపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. గీతం వర్సిటీ పై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అర్ధరాత్రి 200 మందితో వెళ్లి కూల్చాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించిన చిన రాజప్ప , నోటీసు ఇవ్వకుండా కూల్చటం దారుణం అంటూ వ్యాఖ్యానించారు. కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్టుల లక్ష్యంగా ఏపీ లో జగన్ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇలాంటి వికృత చేష్టలకు, వింత పోకడలకు పాల్పడడం దారుణమని మాజీ మంత్రి మండిపడ్డారు. ఉన్నత విద్యా సంస్థలకు సహాయం చేయాలి కానీ ఇలా చేయడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు.