పోలవరం నిధుల కుదింపు మీ కేసుల మాఫీ కోసమే .. చేతకాని 22 మంది ఎంపీలు ఎందుకు? లోకేష్ ఫైర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని , 30 వేల కోట్ల నష్టం జరిగిందని ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైసిపి ఎంపీల చేతకానితనం వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టం అక్షరాలా 30 వేల కోట్ల రూపాయలు అని నారాలోకేష్ అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం అంచనాలను కుదించలేదని, కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలను వైసీపీ ప్రభుత్వం కుదించిందని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు .. కేంద్రాన్ని ఒప్పించేందుకు జగన్ సర్కార్ వ్యూహం ఏంటి ?

మీసం తీయించుకుంటా అన్న మంత్రి ఆ పని చేస్తారా ?
కావాలని తెలుగుదేశం పార్టీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరం 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్తే , మంత్రి అలాంటిది ఏదీ లేదని చెబుతూ, ఒకవేళ 70 శాతం పనులు పూర్తి అయినట్లు చూపిస్తే తాను మీసం తీయించుకుంటానని చెప్పారని గుర్తు చేశారు. పూర్తి కాకుంటే దేవినేని ఉమా మీసాలు తీసేయాలని చాలెంజ్ విసిరినట్లుగా మంత్రి అనిల్ పేర్కొన్నట్లుగా చెప్పిన నారా లోకేష్ ఇటీవల సీఎం జగన్ రివ్యూ సమావేశంలో 70 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారని గుర్తు చేశారు.

నాడు టీడీపీ హయాంలో పెరిగిన అంచనా వ్యయం ఇవ్వటానికి ఒప్పుకున్న కేంద్రం
ఇప్పుడు ఆ మంత్రి మీసాలు తీస్తారా అంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ప్రశ్నించారు నారా లోకేష్.
నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేట్లు పెరిగాయని 55 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా అందుకు కేంద్రం ఒప్పుకుందని గుర్తుచేశారు. ఇక అప్పుడు ట్వీట్ రెడ్డి అయిన విజయ సాయి రెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారని, 55 వేల కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారా అని అడగగా ఒప్పుకున్నట్లు కేంద్రం చెప్పిందని మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

కేవలం కేసుల మాఫీ కోసమే నిధుల కుదింపు .. వైసీపీ ఘనతే ఇది
ఇప్పుడు కేవలం వాళ్ళ కేసుల మాఫీ కోసం ఆ నిధులను 25 వేల కోట్లకు కుదించారు అని మండిపడ్డారు నారా లోకేష్. ఏపీ ప్రభుత్వ తీరుతో చేతగానితనంతో ఆంధ్రప్రదేశ్ కు 30 వేల కోట్ల నష్టం జరిగిందని మండిపడ్డారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తామని చెప్పిన ట్వీట్ రెడ్డి ఏపీకి ఏం తీసుకు వచ్చాను అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.
రాష్ట్రంలో రైతులను అవహేళన చేస్తున్నారని, నాలుగు వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ ల బిగింపు మొదలుపెట్టారని , అది మంచిది కాదని పేర్కొన్నారు.

రైతులను ఎగతాళి చేస్తే జగన్ ను గోచి తో నిలబెట్టే రోజు వస్తుంది
వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. సైకిళ్లకు మీటర్లను తగిలించి ఊరేగిస్తామని తేల్చి చెప్పారు నారా లోకేష్. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్న నారా లోకేష్ రైతులు ఆత్మహత్య చేసుకోవడమేనా రైతు రాజ్యం అంటే అంటూ ప్రశ్నించారు. వర్షాలు ,వరదల వల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనా 100% వేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, ఆక్వా రంగం కుదేలైన కారణంగా వారికి ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్ ను గోచి తో నిలబెట్టే రోజు దగ్గర్లోనే ఉందని జోస్యం చెప్పారు నారా లోకేష్.