రణరంగాన్ని తలపించిన వెలగపూడి... రెండు వర్గాల ఘర్షణలో ఒకరి మృతి.. వివాదానికి కారణమిదే..
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలోని ఎస్సీ కాలనీ ఆదివారం(డిసెంబర్ 27) రాత్రి రణరంగాన్ని తలపించింది. దళిత సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. మరో ఏడుగురు గాయపడ్డారు. కాలనీలో ఆర్చి(ప్రవేశ ద్వారం) నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు దారితీసింది. అక్కడ ఆర్చి నిర్మించి బాబు జగ్జీవన్ రామ్ కాలనీగా నామకరణం చేయాలని ఓ వర్గం భావించగా మరో వర్గం దాన్ని వ్యతిరేకించింది. ఆర్చి నిర్మాణాన్ని అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు,కర్రలతో దాడులు చేసుకున్నాయి. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.


ఆధిపత్య పోరే కారణమా..?
రాష్ట్ర సచివాలయం కొలువైన వెలగపూడిలో ఈ ఘర్షణలు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. కాలనీలో ఆధిపత్య పోరే దీనికి కారణంగా చెబుతున్నారు. కాలనీకి చెందిన ఓ దళిత సామాజికవర్గం అక్కడ ఆర్చి నిర్మించి బాబు జగ్జీవన్ రామ్ కాలనీగా నామకరణం చేయాలని భావించారు. ఎంపీ నందిగం సురేష్ అందుకు మద్దతునివ్వడంతో అక్కడ ఆర్చి నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మరో దళిత సామాజికవర్గం ఈ నిర్మాణాన్ని అడ్డుకుంది. దీంతో వివాదం పోలీసుల దాకా వెళ్లడంతో ఇరువురికి వారు నచ్చజెప్పారు.

మరియమ్మ అనే మహిళ మృతి...
రెండు రోజుల క్రితం సర్దుమణిగినట్లే కనిపించిన వివాదం ఆదివారం మళ్లీ ఆర్చి నిర్మాణ పనులు చేపట్టడంతో రాజుకుంది. నిర్మాణ పనులు ఒక దళిత సామాజికవర్గం అడ్డుకుంది. అక్కడ ఆర్చి కట్టడానికి వీల్లేదని అది తమ వర్గానికి చెందిన స్థలమని అభ్యంతరం చెప్పింది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దాడులు,కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మరియమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరగా... చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మరో ఏడుగురు స్వల్ప గాయాలపాలయ్యారు.

పరామర్శించిన మంత్రి,ఎంపీ,ఎమ్మెల్యేలు...
మరియమ్మ మృతదేహంతో గ్రామంలోకి వచ్చిన ఒక వర్గం అక్కడ ఆందోళనకు దిగింది. తమకు న్యాయం చేయాలని లేదంటే ఆందోళనలు తీవ్రమవుతాయని హెచ్చరించింది. అంతేకాదు,ఎంపీ నందిగం సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. దీంతో గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు ఆ వర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే హోమంత్రి వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదన్నారు. సోమవారం ఉదయం హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సంఘటన బాధాకరమన్న హోంమంత్రి... మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

గ్రామంలో 144 సెక్షన్
ప్రస్తుతం వెలగపూడి ఎస్సీ కాలనీలో 144 సెక్షన్ అమలులో ఉంది. నిజానికి ఇక్కడ ఆర్చి నిర్మాణంపై వివాదం మొదట హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే స్థానిక ఎంపీ,ఎమ్మెల్యే సమక్షంలోనే తేల్చుకోవాలని ఆమె చెప్పి పంపించారని అంటున్నారు. ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని... ఇంతలో ఎంపీ సురేష్ ప్రోద్బలంతో ఒక వర్గం ఆర్చి నిర్మాణానికి పూనుకున్నారని ఆరోపిస్తున్నారు.