టీడీపీని వీడి వెళ్ళే నేతల టార్గెట్ చినబాబేనా !! లోకేష్ టార్గెట్ వెనుక పెద్ద కథే !!
తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వెళుతున్న నేతలు టార్గెట్ లోకేష్ అనడం వెనుక ఆంతర్యమేమిటి? దాదాపుగా పార్టీని వీడి బయటకు వెళుతున్న ప్రతి ఒక్కరు చంద్రబాబు కంటే లోకేష్ ను ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు? ఊరికే వెళ్లకుండా లోకేష్ బాబును నానా మాటలు అని మరీ వెళుతున్నారు. చాలామంది నేతలు లోకేష్ వ్యవహారశైలి నచ్చక ఆ పార్టీని వీడి వెళుతున్నారా? అంటే అవును అని చెప్పక తప్పదు.
కుక్క మూతి పిందె.... మనవడు లోకేష్ కు కొత్త పేరు పెట్టిన లక్ష్మీ పార్వతి

టీడీపీ పరిస్థితికి లోకేష్ కారణం అన్న భావనలో చాలామంది టీడీపీ నేతలు
నారా లోకేష్... తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పార్టీని నడిపిస్తారని అధినేత చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా నమ్మిన సుపుత్రుడు. అయితే చంద్రబాబుకు కొడుకు మీద ఉన్న నమ్మకం, టిడిపిలో ఉన్న చాలామంది నేతలకు లేదనే చెప్పాలి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో చంద్రబాబు తీసుకున్న చాలా కీలక నిర్ణయాల్లో లోకేష్ బాబు పాత్ర ఉంది. చంద్రబాబు తీసుకున్న చాలా తప్పు నిర్ణయాలలో లోకేష్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితికి లోకేష్ కారణం అన్న భావన టీడీపీ నేతల్లో ఉంది.

ఐదేళ్ళ కాలం పాలనలో లోకేష్ పై తెలుగు తమ్ముళ్ళ కసి
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నిరాదరణకు గురైన టిడిపి నేతలు ఇప్పుడు అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలతో ఉన్న పార్టీపై నాలుగు రాళ్ళు వేసి వెళుతున్నారు. ముఖ్యంగా లోకేష్ పై నిప్పులు చెరిగి మరీ వెళుతుండటం పార్టీ శ్రేణుల్లో లోకేష్ పై ఉన్న అసహనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఐదేళ్ల కాలంలో లోకేష్ పై తెలుగు తమ్ముళ్లు చాలా కసి పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పరిపాలనకు సంబంధించిన చాలా కీలక నిర్ణయాలు లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి.

గతంలో మంత్రిగా ఎవరినీ పట్టించుకోని లోకేష్ ... సీనియర్లకు సైతం టైం ఇవ్వని చినబాబు
సీనియర్ మంత్రులు, నేతలను సైతం నారా లోకేష్ పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తనను కలవడానికి కూడా సమయం ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. నాలుగైదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు సైతం లోకేష్ దగ్గరికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఒకవేళ వెళ్లినా లోకేష్ బాబు దగ్గర ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇవే లోకేష్ పై టిడిపి నేతల ఆగ్రహానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

పార్టీ వీడే నేతల అక్కసు లోకేష్ పైనే
గత సార్వత్రిక ఎన్నికల తర్వాత టి.డి.పి ఓటమి పాలు కావడం, ఎవరూ ఊహించని రీతిలో 23 సీట్లకు పరిమితం కావడం అటు చంద్రబాబుకే కాదు, ఇటు చిన్నబాబుకు పెద్ద దెబ్బగా మారింది . లోలోపల రగిలిపోయిన నేతలంతా ఇప్పుడు తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా లోకేష్ వ్యవహరించిన తీరే ఇప్పుడు లోకేష్ పై ఇంత తీవ్రంగా మాటల దాడి చేయడానికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్ చేతిలో పార్టీనా .. వంశీ వ్యాఖ్యలు
తాజాగా పార్టీని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నారా లోకేష్ టార్గెట్ గా పప్పు గాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వాళ్ళ చేతిలో పార్టీ నిలబడుతుందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పప్పు గాడు లాంటి గుదిబండలు టీడీపీలో ఉంటే టిడిపి మునిగిపోవడం ఖాయం అని వల్లభనేని వంశీ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇవే మాటలు అంతర్గతంగా చెప్పే నేతలు, ఎంతమందో ఉన్నారని, టీడీపీలోనే చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

నాడు లోకేష్ ప్రవర్తనే నేటి తీవ్ర విమర్శలకు కారణం
నాడు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ప్రవర్తించిన తీరు, పెద్దవాళ్ళన్న మర్యాద కూడా లేకుండా ఆయన వ్యవహరించిన విధానం చాలా మంది టీడీపీ సీనియర్ నేతల మనసు కష్ట పెట్టింది. ఇక పార్టీని వీడాలనుకుంటున్న గంటా లాంటి నేతలు కూడా లోకేష్ నాయకత్వంలో పని చేయడం కష్టం అనే భావనతోనే పార్టీని వీడి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ భవిష్యత్ నాయకుడు లోకేష్ అంటే టీడీపీలో చాలామంది నేతలు ఉహించుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు.

చంద్రబాబు కంటే టార్గెట్ అయిన లోకేష్ ... ఏపీ పాలిటిక్స్ లో చర్చ
మొత్తానికి నారా లోకేష్ టార్గెట్గా పార్టీని వీడి వెళ్ళే నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రధానంగా ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కంటే ఎక్కువగా టార్గెట్ అవుతున్న లోకేష్ బాబు ప్రవర్తించిన తీరే ఇప్పుడు లోకేష్ పరిస్థితికి కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ ప్రత్యర్థి వర్గాల నుండి మాత్రమే కాకుండా, సొంత పార్టీ నేతల నుండి కూడా నానా తిట్లు తినడం లోకేష్ బాబుకు ఇప్పుడు తలనొప్పిగా మారింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!