రంగనాయకమ్మపై సీఐడీ కీలక ప్రకటన.. పాతవన్నీ తిరగదోడారు.. కార్యకర్తగా నిర్ధారణ, మల్లాదితో మళ్లీ విచారణ
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రంగనాయకమ్మ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవపట్టించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారని ఆమెపై అభియోగంమోపిన సీఐడీ.. గురువారం సుదీర్ఘంగా ప్రశ్నించింది. సీఐడీ ఎస్పీ సరిత పర్యవేక్షణలో ఈ దర్యాప్తు సాగుతోంది. అనంతరం ఆమెను ఇంటికి పంపేసిన అధికారులు.. మరోసారి విచారణకు రెడీగా ఉండాలని చెప్పారు.

తొలిరోజు ఏం జరగిందటే..
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నా అభియోగాలతో కేసు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ తొలిరోజైన గురువారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆమెను అధికారులు ప్రశ్నించారు. కార్యాలయంలోకి వెళ్లేు విచారించారు. రంగనాయకమ్మ సీఐడీ ఆఫీసుకు వెళ్లముందు సీపీఐ నేతలు ఆమెను పరామర్శించగా, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. గంటలపాటు ఆమెను వివిధ రకాలుగా ప్రశ్నించిన సీఐడీ.. సాయంత్రానికి ఓ ప్రకటన విడుదల చేసింది..

ఆమె సోషల్ మీడియా యాక్టివిస్టే..
తాను ఎలాంటి నేరం చేయలేదని, విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే ఫేస్ బుక్ లో షేర్ చేశానని, అలా పోస్టులు పెట్టడం తప్పని కూడా తనకు తెలియదని రంగనాయకమ్మ వాదించారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుచితన పోస్టులు పెడుతూ, వాటిని వ్యక్తిగత అభిప్రాయాలుగా ఎలా చెబుతారంటూ సీఐడీ అధికారులు ఆమెను ఎదురు ప్రశ్నించారు. రంగనాయకమ్మ సోషల్ మీడియా కార్యకర్తే అని సీఐడీ నిర్ధారించింది. ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతోనే ఆమె పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు, సమాధానాలు చెప్పలేకపోయారని అధికారులు పేర్కొన్నారు.

సీఐడీ ప్రకటనలో ఏముందంటే..
విశాఖ గ్యాస్ లీకేజీపై తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారనే అభియోగంపై రంగనాయకమ్మను విచారించిన సీఐడీ.. ఆమె గత కార్యకలాపాలను కూడా తిరగదోడారు. ‘‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం గురించే కాకుండా గతంలోనూ ఆమె చాలా పోస్టులు పెట్టారు. అమ్మఒడి, రైతుభరోసా, వాహనమిత్ర పథకాలను ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి 50శాతం జీతాలు తగ్గించారని మరో పోస్టు పెట్టారు. మూడు రాజధానుల్లో ఒకటి కరోనా... రెండోది విషవాయివు, మూడవది రైతుల ధర్నాఅని మరో పోస్టు పెట్టారు'' అని సీఐడీ తన ప్రకటనలో తెలిపింది.

అరెస్టు ఎప్పుడంటే..
సోషల్ మీడియా పోస్టుపై కేసులో ఏ1గా ఉన్న రంగనాయకమ్మను గురువారం ప్రశ్నించిన పోలీసులు.. మరోసారి విచారణకు హాజరుకావాలంటూ ఇంటికి పంపేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న మల్లాది మల్లాది రఘునాథ్ తో కలిపి ఆమెను ప్రశ్నించే అవకాశముంది. హైదరాబాద్ లో ఉంటోన్న మల్లాదిని విచారణకు రావాల్సిందిగా సీఐడీ ఇప్పటికే నోటీసులు పంపింది. ఇద్దరినీ కలిపి విచారించి, వాళ్లు చెప్పే సమాధానాలను బట్టి ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ప్రాధమిక ఆధారాలు సేకరించిన ఏపీసీఐడీ.. సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ కింద అరెస్టు నోటీసులు ఇచ్చినప్పటికీ.. గురువారం రాత్రి వరకు అరెస్టు, రిమాండ్ కు తరలింపు లాంటి చర్యలు తీసుకోలేదు. మల్లాదిని కూడా ప్రశ్నించిన తర్వాతే సీఐడీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

ఇంతకీ ఎవరీ రంగనాయకమ్మ?
గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన పూంతోట రంగనాయకమ్మ చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కొనసాగుతున్నారు. టీడీపీపై, చంద్రబాబుపై వీరాభిమానాన్ని దాచుకోని ఆమె.. తన ఫేస్బుక్ ప్రొఫైల్ లో ''మళ్లీ నువ్వే రావాలి'' అనే నినాదంతో చంద్రబాబును కవర్ ఫోటోగా పెట్టుకున్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచీ ప్రభుత్వ పథకాలు, విధాన నిర్ణయాలపై నిత్యం తన అభిప్రాయాలను ఆమె ఫేస్బుక్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు సిటీలోని ప్రఖ్యాత హోటల్ శంకర్ విలాస్‌కు ఆమె డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

అసలేంటీ కేసు..
ఈనెల 7న విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ గ్యాస్ దుర్ఘటనపై రంగనాయకమ్మ తన ఎఫ్బీలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. నిజానికి 20 పాయింట్ల రూపంలో ప్రభుత్వ తీరుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ మల్లాది రఘునాథ్ అనే వ్యక్తి రాసిన పోస్టునే రంగనాయకమ్మ షేర్ చేశారు. అయితే కేసులో మాత్రం ఆమెను ఏ1గా, మల్లాదిని ఏ2గా పేర్కొనడం వివాదాస్పదమైంది. రంగనాయకమ్మ, మల్లాదిలపై ఐపీసీ సెక్షన్ 505(2)-తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం, సెక్షన్ 153(ఎ)-ప్రజల మధ్య శతృత్వాన్ని పెంచి, సామరస్యాన్ని దెబ్బతీయడం, సెక్షన్ 188-ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, సెక్షన్ 120(బి)-నేరపూరితమైన కుట్ర, రెడ్ విత్ ఐపీసీ సెక్షన్ 34-ఇతరులతో కలిసి ఉద్దేశపూర్వక నేరానికి పాల్పడటంతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఆధారంగా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమాన ఉంటుందని సీఐడీ పేర్కొంది.