గుంటూరు జిల్లా స్టేట్‌బ్యాంకులో భారీ దోపిడీ- పక్కా స్కెచ్‌తో సినీ ఫక్కీలో 90 లక్షలు కొట్టేసిన వైనం
గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నడికుడి స్టేట్‌బ్యాంకులో సినీ ఫక్కీలో భారీ దొంగతనం చోటు చేసుకుంది.
నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో రూ.90 లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కాజేసిన మొత్తం కంటే వారు దొంగతనం చేసిన విధానం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

నడికుడి భారతీయ స్టేట్‌బ్యాంకులో దొంగతనానికి ఆగంతకులు పక్కా స్కెచ్ వేశారు. చేతికి గ్లోవ్స్ తొడుక్కుని బ్యాంకులోకి ప్రవేశించారు. ముందుగా రెక్కీ చేసుకున్న ప్రకారం సీసీ కెమెరా వైర్లు కట్ చేశారు. విజయవంతంగా దొంగతనం పూర్తి చేశాక పోలీసులకు, డాగ్ స్క్వాడ్‌కు ఆధారాలు దొరక్కుండా బ్యాంకులో కారం పొడి చల్లారు. పకడ్బందీగా జరిగిన ఈ దొంగతనం తర్వాత నిందితులు పారిపోయారు. ఉదయం విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

బ్యాంకులో సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ ఘటనా స్ధలికి చేరుకుని వివరాలు సేకరించారు. దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు నియమించామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానంగా వాహనాలు కనిపించినా పోలీసులకు చెప్పాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి అందిస్తామని ఎస్పీ విశాల్ తెలిపారు. దోపిడీకి పాల్పడిన వారు పక్కా ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. త్వరలోనే వీరిని పట్టుకుంటామన్నారు.