ఉన్మాది సర్కార్‌ను నడిపించేది వారిద్దరే: జగన్ క్రైస్తవుడు..అందుకే మత మార్పిళ్లు: చంద్రబాబు
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ అరెస్టుపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భగ్గు మన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన సాగుతోందని, పోలీసులు రాజ్యాంగానికి లోబడి కాకుండా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఏ తప్పూ చేయకపోయినా, అకారణంగా తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు మళ్లీ రెండుకళ్ల సిద్ధాంతం?: హిందుత్వవాదం..క్రైస్తవ నినాదం: తిరుపతి ఉప ఎన్నికపై

ప్రశ్నించినంత మాత్రాన అరెస్టులా?
కొద్దిసేపటి కిందటే ఆయన అమరావతి ప్రాంతంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. రామతీర్థాన్ని సందర్శించడానికి వెళ్లినందుకే తమ పార్టీ నాయకుడు కళా వెంకట్రావ్‌ను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఏ అధికారంతో విజయసాయి రెడ్డి రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించారని ప్రశ్నించారు. ఆయన్ని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల ఆటలు సాగడానికి తాము అడ్డుగా ఉన్నామని, అందుకే అక్రమంగా అరెస్టులకు పాల్పడుతోందని అన్నారు. తమను కూడా జైళ్లో పెట్టాలని డిమాండ్ చేశారు.

40 ఏళ్ల అనుభవం..
దేశ రాజకీయాల్లో తనంతటి సీనియర్ నాయకుడు మరొకరు లేరని చంద్రబాబు గుర్తు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను ప్రజలకు సేవ చేయడానికి కొనసాగుతున్నానని, అంతే తప్ప ఉన్మాది ప్రభుత్వం చేతుల్లో దెబ్బలు తినడానికి కాదని అన్నారు. ఉన్మాది ప్రభుత్వాన్ని నడిపించేది సజ్జల రామకృష్ణా రెడ్డి, ఏ2 విజయసాయి రెడ్డేనని ధ్వజమెత్తారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఏకంగా తమ పార్టీ నేత ఇంటిపైకి దాడికి వెళ్లారని, ఆయనపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

జగన్ క్రైస్తవుడు.. అందుకే బలవంతపు మత మార్పిళ్లు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే రాష్ట్రంలో ఇష్టానుసారంగా మత మార్పిళ్లు కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ క్రైస్తవుడు కావడం వల్లే మత మార్పిళ్లకు అడ్డకట్ట పడట్లేదని అన్నారు. బలవంతంగా మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే హిందూత్వ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ప్రశ్నించినందుకు తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా ప్రకటనలను ఇప్పించేలా ప్రభుత్వం క్రైస్తవ సంఘాలపై ఒత్తిళ్లను తీసుకొస్తోందని అన్నారు.

ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి..
హిందుత్వ వాదాన్ని పరిరక్షించడానికి తిరుపతిలో తాము నిర్వహించ తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. మళ్లీ ఉపసంహరించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటిదాకా దేవాలయాలపై 150 దాడులు జరిగాయని, దాడి చేసిన వాళ్లను పట్టుకునే తెలివి తేటలు లేవని అన్నారు. పైగా అడ్డుకోబోయిన తమపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. డీజీపీ ఏమనుకుంటున్నాడని, తమాషా చేస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.