లోకేశ్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు: వైసీపీ నిర్ణయం: చంద్రబాబు దీక్షకు పోటీగా పార్ధసారధి సైతం..!
మాజీ మంత్రి లోకేశ్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. ప్రభుత్వ చీఫ్ విప్ పార్టీ నేతలతో ఈ అంశం పైన చర్చించారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 7న ఆర్దిక సాయం అందించింది. శ్రీకాకుళం లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అగ్రిగోల్డ్ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శించారు. అదే సమయంలో హాయ్ ల్యాండ్ స్వాధీనానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీని పైన టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్..స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ వ్యాఖ్యల మీద చంద్రబాబు సైతం స్పందించారు. మాజీ మంత్రి లోకేశ్ ఈ వ్యాఖ్యలకు స్పందనగా స్పీకర్ కు లేఖ రాసారు. ఆ లేఖలో ఆయన చేసిన వ్యాఖ్యల పైన చర్చించిన వైసీపీ నేతలు లోకేశ్ తో పాటుగా మరో ఇద్దరు టీడీపీ నేతలకు సహా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.
రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి జగన్: ఎన్ని మాటలు అన్నా పడతాను: లోకేశ్ దీక్ష విరమణ..!
సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా..టీడీపీ ఎమ్మెల్యే అనిత పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. అదే విధంగా..ప్రత్యేక హోదా పైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేసారు. అదే సమయంలో నినాదాలు చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ నాడు టీడీపీ అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేల మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. దీని పైన నాటి ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు పలుమార్లు వారిని విచారించారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. కొడాలి నాని వంటి వారు సైతం కమిటీ ముందు హాజరయ్యారు. ఇక, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలు స్పీకర్ ను అగౌరపరిచేలా వ్యవహరించారంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వచ్చే నెల మొదటి వారంలో శాసనసభా సమావేశాలు ప్రారంభం కానుండటంతో..ఆ లోగానే నోటీసులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు దీక్షకు పోటీగా పార్ధసారధి..
ఇక, ఇసుక కొరత..ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం విజయవాడలో 12 గంటల దీక్షకు సిద్దమవుతున్నారు. ధర్నా చౌక్ లో ఈ దీక్ష జరగనుంది. అయితే, తాజాగా టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు..ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారంటూ ఛార్జ్ షీట్ విడుదల చేసారు. అందులో తన పేరు ప్రస్తావించటం పైన వైసీపీ నేత పార్ధసారధి ఫైర్ అయ్యారు. సాయంత్రం లోగా చంద్రబాబు తన మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే..చంద్రబాబుకు పోటీగా తాను అదే ధర్నచౌక్ లో దీక్షకు దిగుతానంటూ పార్ధసారధి ప్రకటించారు. చంద్రబాబు అనుసరించిన విధానాల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపించారు. టీడీపీ హాయంలో ఇసుక దోపిడీ ఆయన నివాసం వద్ద నుండే ప్రారంభమైందన్నారు. ఇక, ఇప్పుడు వరదల కారణంగా కొరత వచ్చిందని..అధిగమించి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే..చంద్రబాబు.. పవన్ కలిసి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!