IPL 2020 Final:రోహిత్ శర్మ, ధవన్‌ల ముందు ఉన్న రికార్డులు ఇవే..!
దుబాయ్: కరోనా మహమ్మారి కష్ట కాలంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని ప్రారంభమైన ఐపీఎల్ 13వ సీజన్ ఈ రోజుతో ముగియనుంది. రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలిలిచిన ముంబై మరో కప్పు మీద కన్నేయగా.. మొదటిసారి ఫైనల్ చేరిన ఉత్సాహంలో తొలి టైటిల్ దక్కించుకోవాలని ఢిల్లీ చూస్తోంది. మరి ఈ బిగ్‌ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్‌లో ట్రోఫీతో పాటు కొన్ని రికార్డులు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి.
2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. ప్రతి లీప్ సంవత్సరంలో ఓ కొత్త జట్టు ఛాంపియన్ అవుతోంది. 2008లో రాజస్థాన్ రాయల్స్.. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఇక 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్ కొట్టింది. ఈ ట్రెండ్ ప్రకారం 2020లోనూ కొత్త ఛాంపియన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ కప్ దక్కించుకుంటుంది.

ముంబై ఇండియన్స్ అత్యధికసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆ జట్టు నాలుగుసార్లు టైటిల్ నెగ్గితే.. సరి సంఖ్య వచ్చే ఏడాదిలో కప్ గెలవలేదు. ముంబై 2013, 2015, 2017, 2019 సంవత్సరాల్లో విజేతగా నిలిచింది. ఇవన్నీ బేసి సంఖ్యలే ఇక్కడ విశేషం. ఇది ఢిల్లీకి కలిసిరానుంది. ఇక ఆటగాళ్ల రికార్డులు చూస్తే...
# ఈ మ్యాచ్‌తో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 లీగ్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు.
# ముంబై తరఫున 4,000 పరుగుల మైలురాయికి హిట్‌మ్యాన్ రోహిత్ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు.
# మరో రెండు సిక్సర్లు బాదితే ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టీ20 లీగ్‌లో 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
# ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20 లీగ్‌లో 1,500 పరుగులకు మరో 36 పరుగుల దూరంలో ఉన్నాడు. ఢిల్లీ తరఫున గబ్బర్ ఇప్పటి వరకూ 1,464 పరుగులు చేశాడు.
# ఈ మ్యాచ్‌తో ధావన్‌కు టోర్నీలో టాప్ స్కోరర్ అయ్యే అవకాశం ఉంది. మరో 68 పరుగులు చేస్తే.. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (670)ను అధిగమిస్తాడు.
# ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరో 46 పరుగులు చేస్తే.. ఈ సీజన్లో 500 పరుగుల మార్క్ చేరుకుంటాడు.