ఢిల్లీ లేడీ శ్రీరాం కాలేజ్ విద్యార్థిని షాద్‌నగర్‌లో ఆత్మహత్య.. లేఖలోకారణాలు
ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థి తెలంగాణా ప్రాంతానికి చెందిన ఐశ్వర్యా రెడ్డి నవంబర్ 3 న ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్ యాజమాన్యం వేధింపులు, మరోవైపు కరోనా లాక్డౌన్ కారణంగా మార్చిలో రావాల్సిన స్కాలర్షిప్ రాకపోవడం, విద్యార్థిని చదువుకు కావాల్సిన ఆర్థిక వనరులు తల్లిదండ్రులు సమకూర్చలేకపోవడం ఐశ్వర్య రెడ్డి సూసైడ్ కు కారణమైంది. నవంబర్ 3వ తేదీన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియని తల్లిదండ్రులు తాజాగా ఆమె సూసైడ్ నోట్ లభించటంతో ఫిర్యాదు చెయ్యగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఐఏఎస్ కావాలనుకున్నా ఆర్ధిక ఇబ్బందులు .. కనీసం ల్యాప్ టాప్ కొనలేని స్థితి
టాప్ స్టూడెంట్ అయిన ఐశ్వర్య రెడ్డి ఐఏఎస్ కావాలని ఆకాంక్షించిందని, కానీ తాను చదువుకోడానికి కావాల్సిన సెకండ్ హ్యాండ్ లాప్ టాప్ కొనుక్కోలేని దుర్భరమైన పరిస్థితి నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు అంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు అభ్యసించడానికి ఐశ్వర్యా రెడ్డి సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ ను కూడా కొనుగోలు చేయలేక పోయింది. అప్పటికే ఆమె తల్లిదండ్రులు చదువులో రాణిస్తున్న తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించడం కోసం వారికి ఉన్న ఇంటిని తనఖా పెట్టారు.

చదువు లేని జీవితాన్ని కొనసాగించలేక విద్యార్థిని సూసైడ్
తన కుటుంబానికి తను భారం కాలేనని, అలాగే చదువు లేని జీవితాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని సూసైడ్ నోట్ రాసి 19 ఏళ్ల ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న ఆమె తల్లిదండ్రులు ఐశ్వర్య రెడ్డి మృతితో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఐశ్వర్య, బి.ఎస్.సి. గణితం (ఆనర్స్) విద్యార్థిని , నవంబర్ 3 న షాద్‌నగర్‌లోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడానికి ముందు తెలుగులో ఆమె సూసైడ్ నోట్ రాసినట్టు కుటుంబం తెలిపింది.

స్కాలర్ షిప్ ఇచ్చినా, హాస్టల్ లో ఉండనిచ్చినా బ్రతికేదేమో ..
ఆ సూసైడ్ నోట్లో "నా వల్ల, నా కుటుంబం చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నేను నా కుటుంబానికి భారం. నా విద్య ఒక భారం. నేను చదువు కొనసాగించ లేక పోతే జీవించలేను, నేను చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నా నాకు చావే కరెక్ట్ అనిపిస్తుంది. కనీసం ఇన్స్పైర్ స్కాలర్షిప్ వచ్చేలా చూడండి "అని రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
కరోనా కారణంగా బలవంతంగా హాస్టల్ చేయించడంతో పాటు చదువుకోవటానికి వీలు లేని పరిస్థితులతో ఆవేదన చెందిన ఐశ్వర్యా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. స్కాలర్ షిప్ ఇచ్చినా, హాస్టల్ లో ఉండనిచ్చినా బ్రతికేదేమో అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు .

కాలేజ్ యాజమాన్యమే దీనికి కారణం అంటూ విద్యార్ధి సంఘాలు ఫైర్
ఇటీవల ఇంటికి వచ్చిన ఐశ్వర్యా రెడ్డి ఈ నెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . నిన్న కుటుంబీకులు ఆమె సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐశ్వర్య కాలేజీ హాస్టల్లో నివసిస్తున్నట్లు విద్యార్థి సంఘం ప్రతినిధి ఉన్నిమయ ఎల్ఎస్ఆర్ అధికారులు దీనిని మొదటి సంవత్సరం విద్యార్థి హాస్టల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండవ సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య హాస్టల్‌ను ఖాళీ చేయమని బలవంతం చేశారని , ఐశ్వర్య తన ఇంట్లో ల్యాప్‌టాప్, సరైన విద్యుత్ ఉండదని చెప్పినా ,తాము ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినా ప్రిన్సిపాల్ఎ నుండి టువంటి స్పందన లేదని విద్యార్ధి సంఘం నాయకులు చెప్పారు. ఈ ఘటనకు కళాశాల యాజమాన్యమే బాధ్యులని మండిపడుతున్నారు .