• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇదేమి వాన : 33 ఏళ్ల రికార్డు బద్దలు.. తెలంగాణలో రెడ్ అలర్ట్.. కేసీఆర్ అర్ధరాత్రి సమీక్ష...

|

ఇదేమి వాన.. ఇదేమి వాన... రాష్ట్రంలో సోమవారం (అక్టోబర్ 12) నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టి వర్షానికి సగటు తెలంగాణ ప్రజలు ఇలాగే ఫీల్ అయ్యారు. పట్టుమని పది నిమిషాలు కూడా తెరిపినివ్వకుండా రోజంతా జడివాన రాష్ట్రాన్ని ముంచెత్తుతూనే ఉంది.ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి నాలాలు,డ్రైనేజీలు పొంగి పొర్లి... లోతట్టు ప్రాంతాల్లో నడుం వరకు నీళ్లు చేరాయి. గత 33 ఏళ్లలో కనివినీ ఎరగని రీతిలో కురిసిన ఈ వర్షం నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు చాలామందిని భయభ్రాంతులకు గురిచేసింది. వానగండం ఇప్పటికీ పొంచి ఉండటంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

33 ఏళ్ల రికార్డు బద్దలు...

మంగళవారం తెల్లవారుజామున మొదలైన వాన అర్ధరాత్రి దాటినా కుండపోతగా కురుస్తూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. 33 ఏళ్ల నాటి రికార్డును నిన్నటి భారీ వర్షం తుడిచిపెట్టేసింది. 1988లో తెలంగాణలో 83.2సెం.మీ వర్షపాతం నమోదవగా... తాజా సీజన్‌లో 110.2సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే 18 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. 2002లో హైదరాబాద్ నగరంలో 23సెం.మీ వర్షపాతం నమోదవగా... తాజాగా గ్రేటర్ పరిధిలోని హస్తినాపురంలో 28.08సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో ఏకంగా 32సెం.మీ వర్షపాతం నమోదైంది.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు...

హైదరాబాద్‌లో భారీ వర్షానికి నాలాలు,డ్రైనేజీలు,మూసీ నది పొంగి పొర్లుతోంది. లోతట్టు కాలనీల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరుకున్నాయి. చాలాచోట్ల రోడ్లు చెరువులను తలపించడంతో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రాంనగర్ వీఎస్టీ లాంటి చోట్ల రోడ్లను బ్లాక్ చేశారు. నగరంలో భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ మీదుగా వాయుగుండం...

తీవ్ర వాయుగుండంతోపాటు ఉపరితల ద్రోణి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవలి కాలంలో నగరంపై నుంచి వాయుగుండం ప్రయాణించడం రికార్డని చెబుతున్నారు. రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షానికి శామీర్‌పేట చెరువుతోపాటు ఉస్మాన్‌సాగర్‌, హుస్సేన్‌సాగర్‌లు నిండుకుండలా మారాయి. హుస్సేన్‌సాగర్‌ పూర్తి ఎఫ్‌టీఎల్‌(పుల్ ట్యాంక్ లెవల్) 513.410మీటర్లు కాగా... మంగళవారం రాత్రికి సాగర్‌లో నీటిమట్టం ఎఫ్‌టీఎల్‌ని మించిపోయింది. రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో నీటిమట్టం 513.700 మీటర్ల వరకు నీరు చేరింది. దీంతో లోతట్టు కాలనీలు,బస్తీలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.

సీఎం కేసీఆర్ అర్ధరాత్రి సమీక్ష...

రాష్ట్రంలో వర్ష బీభత్సం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం అర్ధరాత్రి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమయినా అధికారులు వెంటనే అక్కడికి చేరుకునేలా సంసిద్దంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు డీజీపీ మహేందర్‌ రెడ్డిలతో మాట్లాడిన సీఎం లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడిన ఆయన.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును కోరారు. మరోవైపు మంత్రి కేటీఆర్ అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని,మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

English summary
Hyderabad witnessed heavy rains on Tuesday with heavy water-logging and traffic jams in different areas even as several other parts of the state reported similar weather conditions, which were triggered following a deep depression over the west-central Bay of Bengal, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X