గ్రేటర్ పోలింగ్: అణువణువు దుర్భేద్యం, 52 వేల మంది పోలీసులతో భద్రత
మరికొన్ని గంటల్లో గ్రేటర్లో పోలింగ్ జరగనుంది. 150 వార్డుల్లో పోలింగ్‌కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 74.44 లక్షల ఓటర్లు ఉండగా... 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డుకు ఒకరు చొప్పున 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. 150 వార్డుల్లో 2,937 ప్రాంతాలు ఉన్నాయి. అందులో 9101 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, సహాయకులతో కలిపి నలుగురు చొప్పున 36,404 మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. మరో 25 శాతం రిజర్వ్ ఉద్యోగులతో కలిపి 48 వేల సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఎన్నికల అధికారి డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్‌లో బండి సంజయ్ సంచలనం

పాతబస్తీలోనే ఎక్కువగా..
గ్రేటర్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. అయితే పాతబస్తీ పరిధిలో ఎక్కువ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల్లో శాంతి భద్రతల నిర్వహణ కోసం 52 వేల 500 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నా రు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు 60 ఫ్లయింగ్ స్క్వాడ్, 30 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. 12 మంది సాధారణ పరిశీలకులు, 30 మంది వ్యయ పరిశీలకులను నియమించారు.

ఉదయం 5.30 గంటలకే..
మంగళవారం ఉదయం 5.30 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 6 నుంచి 6.15 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 6.55 గంటలకు బ్యాలెట్ బాక్సుల సీల్ తెరుస్తారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియాలి.. కానీ కరోనా నేపథ్యంలో 6 గంటల వరకు సమయం పొడిగించారు.

20 మంది అభ్యర్థులు ఇక్కడే
జంగమ్మెట్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్ కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురు చొప్పున అభ్యర్థులు ఉన్నారు. మెజార్టీ డివిజన్లలో పది మందిలోపే అభ్యర్థులు ఉండడంతో జంబో బ్యాలెట్ అవసరం లేకుండా పోయింది. దీంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సులు సరిపోతాయని అధికారులు తెలిపారు. ఇవాళ డీఆర్సీ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బంది తీసుకోవాలని చెప్పారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే ఎన్నికల సంఘం ప్రకటించిన ఇతర కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపి ఓటు వేయాలని కోరారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, వీల్ చెయిర్లు, ర్యాంపులు వంటివి ఏర్పాటు చేశారు.