గోవా టూర్... ముమైత్ ఖాన్ నన్ను మోసం చేసింది.. క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు...
ఐటెం బాంబ్ ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. గోవా పర్యటన నిమిత్తం తన క్యాబ్‌ని బుక్ చేసుకున్న ముమైత్.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడు. దీనిపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌లో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌కి చెందిన రాజు అనే యువకుడు సొంతంగా క్యాబ్ నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో సినీ నటి ముమైత్ ఖాన్ తన గోవా టూర్ కోసం రాజు క్యాబ్‌ని బుక్ చేసుకుంది. మొదట మూడు రోజులని చెప్పిన ముమైత్... మరో ఐదు రోజులు పొడగించి మొత్తం 8 రోజులు క్యాబ్ సర్వీస్ వాడుకుంది. అయితే ఆ 8 రోజులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండానే ముమైత్ వెళ్లిపోయారని క్యాబ్ డ్రైవర్ రాజు ఆరోపిస్తున్నాడు.

కనీసం టోల్ చార్జీలు, తిండి ఖర్చులు,అకామడేషన్ డబ్బులు కూడా ఇవ్వలేదని... ఆమె నుంచి ఇంకా రూ.15వేలు రావాల్సి ఉందని చెప్పాడు. ఇకనైనా ముమైత్ తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలన్నాడు. మరో డ్రైవర్‌కు ఇలాంటి మోసం జరగకూడదని మీడియా ముందుకొచ్చినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని క్యాబ్ అసోసియేషన్‌లో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు.
టోల్ గేట్ రిసిప్ట్స్,ముమైత్‌తో దిగిన ఫోటోలను రాజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమెతో వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ముమైత్‌పై మండిపడుతున్నారు. రాజు డబ్బులు రాజుకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై ముమైత్ ఖాన్ ఇంతవరకు స్పందించలేదు.
పోకిరి సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' పాటతో ముమైత్ సృష్టించిన హంగామా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె ఐటెం పాటలతో అలరించారు. తెలుగుతో పాటు కన్నడ,తమిళ,హిందీ,మలయాళ,బెంగాలీ సినిమాల్లో నటించారు. తెలుగులో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లలో ముమైత్ కూడా ఒకరు. ఆ షో సందర్భంగానే ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు కూడా తెర పైకి వచ్చాయి.