కఠిన నిర్ణయం తీసుకుంటున్నా..: యువ ఇంజినీర్ వెంకట్ రావు ఆత్మహత్య
హైదరాబాద్: ఇటీవల కాలంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఇంజినీర్ల సంఖ్య పెరుగుతోంది. పని ఒత్తిడి, ఉద్యోగం కోల్పోవడం, తదితర సమస్యలతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా నగరంలోని గచ్చిబౌలిలో ఓ యువ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

జీవితంలో కఠిన నిర్ణయం తీసుకుంటున్నా..
ఓ సంస్థలో సైట్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న వెంకట్ రావు(27) తన హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందే తన సోదరుడికి ఓ సందేశం కూడా పంపించాడు. తన జీవితంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుంటున్నానని సందేశంలో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్తలానికి చేరుకుని.. వెంకట్ రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, వెంకట్ రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టుకు ఉరేసుకుని మరో యువకుడు..
ఇది ఇలావుంటే, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సుధాకర్ కుమారుడు అజయ్(18) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ పూర్తి చేసిన అతడు.. మంగళవారం సాయంత్రం స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాల వెనకున్న నిర్మానుష్య ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పదో తరగతి విద్యార్థిని ప్రేమించిన డిగ్రీ యువతి.. చివరకు
తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని భయాందోళనకు గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్ల అమృతండాలో చోటు చేసుకుంది. ఖమ్మంలో పదో తరగతి చదువుతున్న బాలుడు, డిగ్రీ చదువుతున్న ఓ యువతి(21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. దీంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన వీరిద్దరూ తండా శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారిద్దరి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.