క్రికెట్ బెట్టింగ్‌కు బానిస: అన్నంలో విషం కలిపి తల్లి, చెల్లిని చంపేశాడు, ప్రాణం పోయే వరకూ..
హైదరాబాద్: ఇంట్లోని డబ్బులను దొంగిలించి బెట్టింగ్‌కు పాల్పడవద్దని మందలించిన కన్న తల్లి, సొంత చెల్లిని హతమార్చాడు ఓ దుర్మార్గుడు. తినే భోజనంలో విషం కలిపి వారిని అంతమొందించాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్రికెట్ బెట్టింగ్‌లో భారీ నష్టపోయిన సాయినాథ్ రెడ్డి
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పట్నుంచి భార్య సునీత(42) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుమారుడు సాయినాథ్ రెడ్డి, కుమార్తె అనుషలను పోషిస్తోంది. సాయినాథ్ రెడ్డి ఎంటెక్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనూష బీఫార్మసీ చదువుతోంది. ప్రభాకర్ రెడ్డి మృతి చెందిన సమయంలో వచ్చిన ఇన్స్యూరెన్స్ డబ్బు, భూమి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కలిపి సుమారు 20 లక్షలు బ్యాంకులో పెట్టారు. ఇటీవల సాయినాథ్ రెడ్డి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ భారీగా నష్టపోయాడు.

బ్యాంకులో సొమ్మునూ దొంగిలించడంతో..
ఈ క్రమంలో తన తల్లికి తెలియకుండా బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేశాడు. అంతేగాక, ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను కూడా అమ్మేసి బెట్టింగ్ పాల్పడేందుకు ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసి సునీత తన కుమారుడు సాయినాథ్ రెడ్డిని నిలదీసింది. ఇలా చేయొద్దంటూ మందలించింది.

అన్నంలో విషం పెట్టి..
ఈ నేపథ్యంలో తల్లిని, చెల్లిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు సాయినాథ్ రెడ్డి. నవంబర్ 23న ఇంట్లో వండిన రాత్రి భోజనంలో రసాయన గుళికలు(విషం) కలిపి విధులకు వెళ్లాడు. భోజనం చేసిన తర్వాత కడుపులో తిప్పినట్లుగా ఉందని.. నువ్వు తీసుకెళ్లిన అన్నం తినవద్దని అసలు విషయం తెలియని సునీత తన కుమారుడు సాయినాథ్ రెడ్డికి తెలిపింది.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా..
వెంటనే ఇంటికి చేరుకున్న సాయినాథ్ రెడ్డి.. తల్లీ, చెల్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లేవరకూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 27న అనూష, 28న సునీత మరణించారు. అంత్యక్రియల అనంతరం సాయినాథ్ రెడ్డిని బంధువులు నిలదీయగా.. నిజం ఒప్పుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం రాత్రి నిందితుడు సాయినాథ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ బానిసై ఇంత దారుణానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా కలకలంగా మారింది.