శాపంగా చెరువుల ఆక్రమణ: పేరుకుపోయిన చెత్త, మురుగునీటితో కాలనీ వాసుల ఇబ్బందులు
వర్ష బీభత్సంతో హైదరాబాద్ చిత్తడయిన సంగతి తెలిసిందే. రెండు వారాల తర్వాత భాగ్యనగరం క్రమంగా కోలుకుంటోంది. అయితే వ్యర్థాలను డంపింగ్ యార్డులలో పడేస్తున్నారు. అవీ క్రమంగా చెరువుల్లోకి వెళ్లి మురుగునీరుగా మారిపోతోంది. కొన్ని కాలనీలకు ఆ దుర్వాసన ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆక్రమణలు, సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం. చిన్నపాటి వర్షం పడితే చాలు సిటీ రోడ్లపై నీరు తేలియాడుతోంది.

వ్యర్థాలతో నిండిన షా హతీమ్ తలాబ్
గోల్కొండ కోట సమీపంలో గల షా హతీమ్ తలాబ్ వద్ద వ్యర్థాలు నిండిపోయాయి. ఇంటి వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టక్తో ఆ ప్రాంతం నిడిపోయింది. షా హతీమ్ వద్ద వ్యర్థాలు నిండిపోవడం సాధారణంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు ట్రక్కులు వచ్చి చెత్తను పడేసి వెళ్లిపోతాయని.. చెబుతున్నారు. కానీ ఆ కుళ్లిన వాసన భరించలేకపోతున్నామని స్థానికుడు అథర్ తెలిపారు.

మలేరియా, డెంగ్యూ..
హఫీజ్ బాబా నగర్, జుబలీ కాలనీకి చెందినవారు కూడా అథర్ మాదిరిగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలతో దోమలు చేరి.. మలేరియా, ప్రాణాంతక డెంగ్యూ బారినపడుతున్నామని తెలిపారు. వరదనీరు కాలువల్లోకి రావడం వల్ల అందులో నిలిచిన ప్లాస్టిక్ వస్తువులు దోమలకు ఆవాస కేంద్రాలుగా మారుతున్నాయని చెప్పారు.

వారం రోజులు బ్లీచింగ్.. తర్వాత
వరదలు వచ్చిన సమయంలో తమకు బల్దియా సిబ్బంది మాత్రలు ఇచ్చారని తెలిపారు. తమ ప్రాంతాన్ని బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రపరిచారని తెలిపారు. కానీ దానిని వారం రోజులు మాత్రమే కొనసాగించారని వివరించారు. కంటిన్యూ చేస్తే పరిస్థితి తమకు అనుకూలంగా ఉండేదని చెప్పారు. స్వచ్చమైన నీరు లభించకపోవడంతో కడుపు నొప్పి, చర్మ వ్యాధుల బారినపడుతున్నామని తెలిపారు. తమ కుటుంబం ఇప్పటికీ వరదనీటితో ఇబ్బందికి గురవుతుందని హఫీజ్ అనే విద్యార్థి తెలిపారు.

చార్మినార్ నుంచి 10 వేల మెట్రిక్ టన్నులు
వరదల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి బల్దియా శిథిలాలను తొలగించడానికి స్పెషల్ డ్రైవ్ చేప్పటింది. చార్మినార్ జోన్ నుంచి అత్యధికంగా 10 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించింది. కానీ రహదారుల పక్కన చెత్త వేయడం, నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్నారని.. దీనిని తీయడం తమకు సవాలుగా మారిందని చెప్పారు. కానీ సేకరించిన వ్యర్థాలను మాత్రం కాల్చివేస్తామని బల్దియా అధికారి ఒకరు వివరించారు.

ఆక్రమణే సమస్య
చెరువులను ఆక్రమించడం ప్రధాన సమస్య అవుతోందని అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యర్థాలు పేరుకు పోతున్నాయని.. వాటిని తీసుకెళ్లడం సమస్యగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని భౌగొళిక శాస్త్రవేత్త అనంత్ కోరారు.