పైకి కొండంత రాగం.. లోన చీకటి మిత్రులే..-అమిత్ షా-కేసీఆర్పై రేవంత్
తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసినట్టుగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న అమిత్ షాకు తెలంగాణ ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు సంధించామని, వాటికి అమిత్ షా అసలు సమాధానాలే ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయిందని అభిప్రాయపడ్డారు. చీకటి మిత్రుడిపై ఈగవాలనివ్వరు అని సెటైర్ వేశారు.

అంతకుముందు అమిత్ షా బహిరంగ సభ వేదిక నుంచి మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం తాను తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని.. బండి సంజయ్ ఒక్కరే చాలన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేపట్టిన పాయాత్ర శనివారం ముగించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామకాల హామీలను నెరవేరుస్తామని చెప్పారు. హైదరాబాద్ విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని అమిత్ షా చెప్పారు. తెలంగాణను కేసీఆర్ మరో బెంగాల్ లా మారుస్తారని విమర్శించారు. బండి సంజయ్ సాగించిన పాదయాత్ర అధికారం కోసమో, ఒక పార్టీ నుంచి మరో పార్టీకి అధికార బదలాయింపు కోసమో కాదని అమిత్ షా చెప్పారు. ఆత్మగౌరవ పోరాటం అని చెప్పారు. కుమారుడు, కూతురుకు అధికారం ఇచ్చిన కేసీఆర్ సర్పంచ్లకు మాత్రం అధికారం ఇవ్వలేదని అమిత్ షా విమర్శించారు.