ఈ మరణ మృదంగం ఆగదా ? ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె డోలాయమాన స్థితికి చేరుకుంది. సీఎం కేసీఆర్పట్టు విడవకపోవటం, అటు హైకోర్టు కూడా ఎటూ తేల్చలేకపోవటంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరే పరిస్థితి లేక, జీవనోపాధి లేక, బతుకు భారంగా మారుతున్న కార్మికులు అత్మహత్యలబాట పడుతుంటే, కొందరు మనస్తాపంతో తీవ్ర అస్వస్థతకు లోనవుతూ ప్రాణాలు వదులుతున్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో చావు డప్పు మోగుతూనే ఉంది. మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది.
ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు ..ఆర్టీసీ సమ్మెపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికుల మరణాలు అంటున్న కార్మికులు
ఒక పక్క ప్రభుత్వ తీరు మారకపోవటం, కోర్టు కూడా ఎటూ తేల్చకపోవటం, మరోపక్క ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు, ఇంకొక వైపు ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆర్టీసీ కార్మిక లోకాన్ని బాగా టెన్షన్ పెడుతున్నాయి. సమ్మె ప్రారంభమై 40 రోజులు దాటుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు . సమ్మెకు మాత్రం సరైన పరిష్కారం దొరకడంలేదు. సమ్మె పై ప్రభుత్వం వ్యవహరించే తీరుతో ఇప్పటికే పలువురు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోగా , నిన్నటికి నిన్న గరీబోళ్ళం సారూ కనికరించండి అంటూ ఓ ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆతమహత్యకు పాల్పడ్డాడు. ఇక తాజాగా మరో గుండె ఆగిపోయింది.

గుండెపోటుతో నారాయణఖేడ్ డిపో ఆర్టీసీ కండక్టర్ నగేష్ మృతి
తాజాగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీసీ కార్మికుడు నగేష్ మృతి చెందాడు. నారాయణఖేడ్ డిపోలో నగేష్ కండక్టర్గా పని చేస్తున్నాడు. నవంబర్ 5న కేసీఆర్ డెడ్లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ వార్త విని నగేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుండి ఆయన చావుతో పోరాటం చేసి చివరకికి మృత్యు ఒడిలోకి జారిపోయారు. దీంతో మరో ఆర్టీసీ కార్మికుడి కుటుంబం గుండెలవిసేలా రోదిస్తుంది. నగేష్ మృతితో కార్మిక లోకం ఆవేదన చెందుతుంది.

చలనం లేని ప్రభుత్వం ... చేష్టలుడిగి చూస్తున్న ప్రతిపక్షాలు
వరుసగా కార్మికులు మరణిస్తున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు. ఇక ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేస్తుందని భావించిన హైకోర్టు కూడా ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇక ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్న వేళ మరిన్ని మరణాలు చూడాలో అన్న బాధ అందరిలో కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటాలు చేస్తున్నా వారి పోరాటాలు సైతం నిరర్ధకంగా మారాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా కిందకు దిగలేదు.

కార్మిక కుటుంబాలను కన్నీటిపర్యంతం చేస్తూ కొనసాగుతున్న మృత్యుహేల
నిన్నటికి నిన్న మహబూబాబాద్ లో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడుతూ తనమరణమే చివరిది కావాలని కోరుకున్నాడు. మరణ వాంగ్మూలం రాశాడు.తన సూసైడ్ నోట్ లో ఆర్టీసీ కార్మిక కుటుంబాల పరిస్థితి చాలా స్పష్టంగా వివరించాడు. కేసీఆర్ కనికరించాలని దయ చూపాలని ప్రాధేయపడ్డాడు. అయినా ఫలితం లేదు . స్పందించిన నాధుడు లేడు. ఆర్టీసీ కార్మికుల వేదన అరణ్య రోదనగా మారింది. కార్మిక కుటుంబాలను కన్నీటిపర్యంతం చేస్తూ మృత్యుహేల కొనసాగుతుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!