కేసీఆర్ నిజంగా హిందువైతే ..పాతబస్తీలో దేశద్రోహ పార్టీపై ఆ పని చెయ్ .. బండి సంజయ్ సవాల్
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు, వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఒకపక్క అధికార టీఆర్ఎస్ పార్టీ పై నిప్పులు చెరుగుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోపక్క ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్మగూడ డివిజన్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారాన్ని నిర్వహించారు.
గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దొరగారి మాస్టర్ ప్లాన్ ఇదే .. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

పక్కా సమాచారం ఉంటే అరెస్ట్ ఎందుకు చెయ్యట్లేదు ..ఇది ఓటర్లను భయపెట్టే కుట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా హిందువు అయితే పాతబస్తీలో బహిరంగ సభ పెట్టి దేశద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీ అరాచకాలను ప్రజలకు వివరించాలని సవాల్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .
మతకల్లోలాలు రగిల్చేందుకు కుట్ర చేస్తున్నారని సీఎం కేసీఆర్, డీజీపీల దగ్గర పక్కా సమాచారం ఉంటే ఎందుకు అరెస్టు చేయడం లేదో స్పష్టం చేయాలన్నారు. ముఖ్యమంత్రి సాక్షాత్తూ భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఓటర్లు ఓటింగ్లో పాల్గొనకుండా ఉండడం కోసం కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అంటూ మండిపడ్డారు.

బీజేపీ కి ఓటేస్తే ప్రజల కోసం చేసే పనులివే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా లో జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని, హెల్త్ కార్డులు రెన్యువల్ చేయడంతో పాటుగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కచ్చితంగా ఉచిత ట్రీట్మెంట్ జరిగేలా చేస్తామని ఆయన తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన బండి సంజయ్, అర్హులైన ఏ ఒక్కరు బాధ పడాల్సిన అవసరం లేదని బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

కేసీఆర్ స్వార్ధం కోసం యాగాలు , కాషాయ వస్త్రాలు ..
అంతేకాదు కరోనా వారియర్స్ గా కృషిచేసిన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు.
జిహెచ్ఎంసి పరిధిలోని ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా పథకం వర్తింప చేస్తామని, సొంత ఆటోలు నడిపే వారికి ఇన్సూరెన్సు, రిపేరు మరియు ఫిట్నెస్ అవసరాల కోసం ప్రతి ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడిన బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం యాగాలు చేసి కాషాయ వస్త్రాలు ధరించిన అంతమాత్రాన ప్రజలు గుర్తించరని పేర్కొన్నారు.

దేశ ద్రోహ పార్టీతో స్నేహాలు .. ఓటుతో బుద్ధి చెప్పాలన్న బండి సంజయ్
దేశద్రోహి పార్టీ అయినా మజ్లిస్ తో స్నేహం చేస్తూ, హిందూ దేవుళ్లను దూషించే పార్టీతో చెట్టపట్టాలేసుకుని తిరిగినప్పుడు నీవు ఎలాంటి హిందువో సమాజం అర్థం చేసుకుంటుంది అంటూ మండిపడ్డారు బండి సంజయ్. కావాలని మత విద్వేషాలు అంటూ ప్రజలను భయపెడుతున్నారని జిహెచ్ఎంసి ప్రజలు భయపడవద్దని, అందరూ ఓటింగ్లో పాల్గొనాలని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. భాగ్యనగర్ నిరుద్యోగులను నట్టేట ముంచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులాలు వర్గాలకు అతీతంగా ఒకటై ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. టిఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.