పోలింగ్ శాతం తగ్గించే కుట్ర చేసిన టీఆర్ఎస్ .. కేసీఆర్.. కౌంట్ డౌన్ స్టార్ట్ అన్న బండి సంజయ్
జిహెచ్ఎంసి ఎన్నికలలో పోలింగ్ అనూహ్యంగా తగ్గింది. ఈసారి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసినప్పటికీ గ్రేటర్ ఓటర్లను మాత్రం పోలింగ్ బూత్ ల వైపు తీసుకెళ్లలేకపోయారు. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఎన్నికలలో దారుణంగా పోలింగ్ శాతం నమోదు కావడం ఇప్పుడు ఎన్నికల్లో ఓటింగ్ పై చర్చకు కారణమవుతుంది. ఇంత దారుణంగా ఓటింగ్ తగ్గడానికి కారణం ఏంటి అన్న కోణంలో ప్రజలు, రాజకీయ పార్టీలు ,అధికార యంత్రాంగం ఆలోచనలో పడింది.
కేసీఆర్ నిజంగా హిందువైతే ..పాతబస్తీలో దేశద్రోహ పార్టీపై ఆ పని చెయ్ .. బండి సంజయ్ సవాల్

పోలింగ్ తగ్గటానికి కారణం టీఆర్ఎస్ పార్టీనే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ తగ్గడానికి టీఆర్ఎస్ పార్టీనే ప్రధాన కారణమని ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు తప్పుడు ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. ఫలితంగా గ్రేటర్ లో పోలింగ్ పర్సంటేజ్ బాగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ శాతాన్ని తగ్గించడం కోసం టిఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని బండి సంజయ్ ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీ కి కౌంట్ డౌన్ మొదలైంది
ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఫెయిల్ అయిందని పేర్కొన్న బండి సంజయ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిపిఎం, సిపిఐ పార్టీ ల గుర్తు ఏదో తెలియకుండా ఉందని ఎన్నికల కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు . టిఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని పేర్కొన్న బండి సంజయ్, టిఆర్ఎస్ పార్టీ , ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లోనే జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు అందరూ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు.

మతాన్ని బూచిగా చూపి కేసీఆర్ ప్రజలను భయపెట్టారు .. అధికారులు అంతా టీఆర్ఎస్ వైపే
మతాన్ని బూచిగా చూపి తప్పుడు ప్రచారం చేశారని, మతకల్లోలాలు జరుగుతాయి అంటూ ప్రజలను భయపెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. టిఆర్ఎస్ తరఫున పోలీసు అధికారులు డబ్బులు పంచారు అంటూ విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలు వేశారంటూ బండి సంజయ్ విమర్శించారు. అడ్డదారుల్లో , అక్రమ విధానాల్లో గెలిచే ప్రయత్నం చేశారు అంటూ నిప్పులు చెరిగారు.

ఈ ఎన్నికలు కుటుంబ పాలనకు ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన ఎన్నికలు
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ సరిగా జరగలేదని, ప్రభుత్వం పదే పదే అవాంతరాలు సృష్టించిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ ఎన్నికలు కుటుంబ పాలనకు ,ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన ఎన్నికలుగా బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి మేయర్ స్థానాన్ని గెలవబోతోంది అంటూ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.