కౌన్ కిస్కా సీఎం కేసీఆర్.. ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని పదేపదే టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సమాజానికి ప్రధానమంత్రి సమాధానం చెప్పారని, సీఎం కేసీఆర్ కు చెప్పాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో, తిరిగి ఆయనకు వీడ్కోలు పలకడానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన బండి సంజయ్ ప్రధాని వీడ్కోలు అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం ఎవరు? కౌన్ కిస్కా అంటూ మండిపడిన బండి సంజయ్ కెసిఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. అసలు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

ప్రజల దగ్గర మొహం చెల్లక సీఎం కేసీఆర్ పారిపోతున్నారు అంటూ బండి సంజయ్ విమర్శించారు. నిన్నటి ప్రధానమంత్రి సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. నిన్నటి విజయ సంకల్ప సభతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత స్పష్టమైందని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కెసిఆర్ ప్లెక్సిల రాజకీయం చేశారని, ఫ్లెక్సీల కోసం కెసిఆర్ ఖర్చు పెట్టిన డబ్బు, పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని బండి సంజయ్ హితవు పలికారు. కెసిఆర్ తప్పుడు విధానాల వల్లనే నిన్నటి సభకు ప్రజల నుండి విశేషంగా మద్దతు వచ్చిందని, ప్రజలు కెసీఆర్ పాలనతో విసిగిపోయారని బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. నిన్నటి సభతో, మోడీ బండి సంజయ్ ను వెల్డన్ అని పొగడటంతో ఫుల్ జోష్ లో ఉన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మాటల దాడిని పెంచుతున్నారు.