బీజేపీ అసెంబ్లీ ముట్టడి .. అడ్డుకున్న పోలీసులు.. బండి సంజయ్ తో సహా రాష్ట్ర వ్యాప్త అరెస్టులు
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడించడానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు అసెంబ్లీ ముట్టడి యత్నాన్ని భగ్నం చేశారు.
కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చరు: కేసీఆర్ సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజం
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ తో అసెంబ్లీని ముట్టడించడానికి బిజెపి నాయకులు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించి అసెంబ్లీ వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. లకిడికపూల్, నాంపల్లి ,అసెంబ్లీ ,పోలీస్ కంట్రోల్ రూమ్ ల మార్గాలలో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహన రాకపోకలను నిలిపివేశారు. అయినప్పటికీ అసెంబ్లీ రెండో గేటు ప్రాంతంలో బిజెపి కార్యకర్తలు దూసుకు రావడంతో వారిని అడ్డుకున్న పోలీసులు, వారిని చెదరగొట్టారు.
ముట్టడికి బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్
బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బీజేపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు బంజారాహిల్స్ నుండి అసెంబ్లీకి బయలుదేరిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్గమధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లడానికి ప్రయత్నించిన బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ ను అశోక్ నగర్ లోని ఆయన నివాసం వద్ద చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు , కార్యకర్తలు
బిజెపి నాయకులు రామచంద్ర రావు, మోత్కుపల్లి ఇంటివద్దనే పోలీసులు అడ్డుకున్నారు . అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఖమ్మం, నల్గొండ, భద్రాచలం కార్యకర్తలను రవీంద్రభారతి చౌరస్తా లో పోలీసులు అరెస్ట్ చేశారు . రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరడంతో జిల్లాల వారీగా ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జి అందెల శ్రీరాములును , కార్యకర్తలను ఈరోజు తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ ఇన్చార్జి శ్రీధర్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

వరంగల్ అర్బన్ నుండి భారీగా నాయకులు , కార్యకర్తలు.. అరెస్టుల పర్వాలు
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ లో భాగంగా బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారి నాయకత్వంలో దాదాపు 60 మంది బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా నాయకులు, కార్యకర్తలు గన్ పార్క్ ముందు నుండి అసెంబ్లీ ముందుకు ప్లా కార్డ్స్ ప్రదర్శిస్తూ చేరుకున్నారు.బీజేపీ నాయకుల ఆందోళనను పోలీసుల అడ్డుకోవటంతో గందరగోళం నెలకొంది. కార్యకర్తల తీవ్ర ప్రతిఘటన మధ్య రావు పద్మతో పాటు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.