ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లెవరూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోరని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంజయ్... ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జారిపోకుండా కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటని... ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకున్నానని కేసీఆర్ ఎమ్మెల్యేలతో అబద్దాలు చెప్తున్నాడని ఆరోపించారు. ప్రజల్లో,ఎమ్మెల్యేల్లో ఒకరకమైన గందరగోళం సృష్టించేందుకే కేసీఆర్ ఈ ప్రచారానికి తెరలేపారని విమర్శించారు. ఆదివారం(జనవరి 25) పలువురు నేతలు పార్టీలో చేరిన సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఖబడ్దార్... చెప్పా పెట్టకుండా ముట్టడిస్తాం... జనగామ లాఠీచార్జి ఘటనపై బండి సంజయ్ కౌంటర్...

దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి... : సంజయ్
ఢిల్లీ వెళ్లి బీజేపీతో కేసీఆర్ పొత్తు కుదుర్చుకున్నానని చెప్తున్న కేసీఆర్.. దమ్ముంటే దానిపై బహిరంగ ప్రకటన చేయాలని సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ చేయిస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని... 2024లో ఒంటరిగానే పోటీ చేసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తెలిపారు. టీఆర్ఎస్లో చాలామంది ఎమ్మెల్యేలు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారని... మంత్రి పదవులు ఇస్తానని కేసీఆర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలి...
సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని భావిస్తే... మళ్లీ ఎన్నికలను ఎదుర్కొని ప్రజా తీర్పు కోరాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పును స్వాగతిస్తామన్నారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్ ఫాంహౌస్‌లో యాగం చేసి... పూజా సామాగ్రిని కాళేశ్వరంలో కలిపారని అన్నారు. ఈ విషయం నేను చెప్పి మూడు రోజులు అవుతోందని... ఇప్పటికీ దీనిపై ఎటువంటి స్పందన లేదంటే ఇందులో నిజం ఉన్నట్లే కదా అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు ఎవరైతే కోరుకుంటున్నారో... ఒకవేళ వారికి మంత్రి పదవులు దక్కని పక్షంలో వారే కొత్త పార్టీ పెడుతారని అన్నారు.

రామ మందిరం కోసం కలిసికట్టుగా...
రామ మందిరం కోసం బిచ్చం ఎత్తుకునేందుకు కూడా బీజేపీ సిద్దమేనని సంజయ్ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నామన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలా వద్దా.. అయోధ్య రామజన్మ భూమి అవునా కాదా కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రామ మందిర నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేద్దామని... అయోధ్య విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు వద్దని సంజయ్ హితవు పలికారు.