కిన్నెర మొగులయ్య మనస్థాపం: పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా, బీజేపీ నేతలు బదనాం చేస్తున్నారు..
12 మెట్ల కిన్నెర కళాకారుడు కిన్నెర మొగులయ్య ఇబ్బందుల గురించి నిన్ననే డిస్కష్ చేశాం కదా.. అయితే ఓ వీడియో వైరలయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కోటి రూపాయలు సొంత డబ్బు ఇస్తున్నాడా అని బీజేపీ వాళ్లు తనతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పద్మ శ్రీ వారిదా..?
పద్మ శ్రీ అవార్డు బీజేపీ వాళ్లదని వాదిస్తున్నారని గుర్తుచేశారు. అందుకే వాపస్ ఇచ్చేస్తానన్నారు. తనకెందుకు బదానం అని అంటున్నారు. తన నోట్లో మన్ను కొట్టాలని చూస్తే పాపం తగులుతుందని మొగులయ్య అన్నారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని తెలిపారు. రాజకీయాల కోసం వాడుకోవద్దని కోరారు.

కేసీఆర్ సారే గుర్తించారు..
కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ పాటలు పాడేవాడినని, తన కళను టీఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తించిందని వివరించారు. సీఎం కేసీఆర్ తన కళను గుర్తించి రవీంద్ర భారతిలో ఆరేళ్ల క్రితమే సత్కరించారని గుర్తు చేశారు. అప్పుడే బయటి లోకానికి తెలిసానని వివరించారు. తర్వాతే ఓ సినిమాలో పాట పాడానని, అనంతరం తనకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తనను ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. కేసీఆర్ ప్రభుమే తనను గుర్తించిందని చెప్పారు.

ఆదుకుంటాం..
కిన్నెర మొగులయ్యకు ఇంటిస్థలంతోపాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొగులయ్య తో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య ఆ సమయంలో సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని అంతకుముందు సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని వివరించారు.

ఇదీ నేపథ్యం
నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకులకు చెందిన దర్శనం మొగులయ్య.. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతో కాలం వెళ్లదీస్తున్నాడు. ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తన కళను అందరికీ పరిచయ చేస్తున్నారు. మొగులయ్య వాయించే పరికరాన్ని మెట్ల కిన్నెర అంటారు. దాన్ని భుజాన పెట్టుకొని పాడే పాటను సాకి అంటారు. స్థానికంగా దొరికే వస్తువులతో ఈ కిన్నెరను తయారు చేస్తారు. అలా తన కళను బతికించుకుంటున్నారు.