గ్రేటర్ లో కమలవ్యూహం ... రేపు హైదరాబాద్కు అమిత్ షా… నేరుగా చార్మినార్ వద్దకే
జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మోత పుట్టిస్తోంది. టిఆర్ఎస్ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది .జిహెచ్ఎంసి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలలో గ్రేటర్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని ప్రయత్నం చేస్తోంది . ఈ ఎన్నికలు భవిష్యత్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పునాది వేస్తాయని బలంగా నమ్ముతున్న బీజేపీ అధినాయకత్వం అగ్రనేతలను రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు .

బీజేపీ ప్లస్ అవుతుందని భావిస్తున్న అంశాలు ఇవే
దుబ్బాక ఎన్నికల ఫలితం, తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వ మార్పు, దూకుడు చూపిస్తున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరు, ఫైర్ బ్రాండ్ ఎంపీ అరవింద్ , డీకే అరుణ ల దూకుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుంది అన్న భావనకు కారణాలుగా చెప్పొచ్చు . మరోపక్క గత ఆరేళ్లుగా టిఆర్ఎస్ పార్టీ పాలనపై ఇటీవల కాలంలో ప్రజల్లో పెరుగుతున్న విముఖత, గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన ఇబ్బంది పడిన గ్రేటర్ వాసుల అసహనం తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు బిజెపి అగ్రనేతలు .

జాతీయ నాయకుల ప్రచారానికి కారణాలెన్నో
ఈసారి ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్ లో కాషాయ జెండా ఎగురవేయాలని పక్కా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని దాటి వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ నేతల ప్రచారంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దేశవ్యాప్త ఆసక్తికి కారణమవుతున్నాయి. ఇక హైదరాబాద్ లో ఇతర రాష్ట్రాల వాళ్ళు 13% మంది ఉండటంతో వారిని ప్రభావితం చెయ్యటం కోసమే వివిధ రాష్ట్రాల నుండి కీలక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ ప్రభావం 48 డివిజన్లలో ఉండనునట్టు సమాచారం .

రంగంలోకి దిగుతున్న బీజేపీ రాజకీయ చాణిక్యుడు అమిత్ షా
రేపు సాయంత్రం 6 గంటల వరకే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి డెడ్లైన్ కావడంతో రేపు బిజెపి గ్రేటర్ ఎన్నికల చాణిక్యంలో భాగంగా అమిత్ షా ను రంగంలోకి దింపుతుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్మృతి ఇరానీ, తేజస్వి సూర్య వంటి ప్రభావం చూపగలిగిన నేతలు రంగంలోకి దిగారు. ఇక కేంద్రంలో నంబర్ టు అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రేపు పాల్గొననున్నారు.

చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్ షా పూజలు
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం కోసం రేపు హైదరాబాద్ కు రానున్న అమిత్ షా రేపు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా చార్మినార్ వద్దకు చేరుకుని అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు . దాదాపు 30 నిమిషాల పాటు ఆయన ఆలయం వద్దనే ఉండనున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని వారాసిగూడలో అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అమిత్ షా తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు .. భద్రత కట్టుదిట్టం
అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు ఓల్డ్ సిటీలో భారీగా మోహరించాయి. అటు బిజెపి, ఎంఐఎం పార్టీ ల మధ్య మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచే పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు . రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. రేపు అమిత్ షా రోడ్ షో నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నాయి.

కమల వ్యూహం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో?
బీహార్ లో పార్టీ విజయానికి బాటలు వేసిన సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకొని వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు. మొత్తానికి జిహెచ్ఎంసి ఎన్నికలలో జాతీయ నాయకులను రంగంలోకి దింపిన కమల వ్యూహం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.
గ్రేటర్ వాసులు బీజేపీ కి ఏ మేరకు తమ మద్దతును అందిస్తారో త్వరలోనే తేలనుంది . ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ లో తెలంగాణాలో పార్టీ గమనాన్ని నిర్దేశిస్తాయి.