మంటగలిసిన మానవత్వం ... కాప్రా చెరువు నాలాలో ఆడశిశువు మృతదేహం
మానవత్వం మంట కలుస్తోంది. కసాయి తనం రాజ్యమేలుతోంది. నవమాసాలు మోసి, కన్న బిడ్డని ఏ తల్లి కాదనుకుందో, లేదా మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారో.. కారణం ఏమై ఉంటుందో కానీ ముక్కుపచ్చలారని నవజాత శిశువు మృతదేహం ఓ నాలాలో తేలియాడుతూ కనిపించిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దృశ్యం చూపరులను ఆవేదనకు గురి చేసింది.
ప్రేమించలేదని పెట్రోల్ పోసి యువతిని సజీవదహనం చేసిన యువకుడు ..విజయవాడలో దారుణ ఘటన

నాలాలో కొట్టుకువచ్చిన ఆడశిశువు మృతదేహం
చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ శుభోదయ కాలనీ కల్వర్టు సమీపంలో కాప్రా చెరువు నాలాలో బొడ్డు కూడా ఊడని ఆడ శిశువు మృతదేహం కనిపించింది. నవజాత శిశువు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కాప్రా చెరువు నాలా కీసర సమీపంలోని నాగారం సరస్సు వరకు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. పసి బిడ్డను కొద్ది రోజుల క్రితం నీటిలో పడవేసినట్టు, వర్షాల కారణంగా నీటి మట్టం పెరగటంతో మృతదేహం పైకి వచ్చినట్టు భావిస్తున్నారు.

ఆడ శిశువు మరణంపై పోలీసుల దర్యాప్తు
ముక్కుపచ్చలారని ఆడపిల్లని ఇలా పడేసిన వారు ఎవరు? ఈ మృతదేహం ఎక్కడో పడేస్తే ఇక్కడకు వచ్చిందా ? ఈ ఆడశిశువు అక్రమ వ్యవహారం వల్ల పుట్టిన సంతానమా, లేక తల్లిదండ్రులు ఆడపిల్లని ఈ ఘాతుకానికి పాల్పడ్డారా ? అన్నది పోలీసులు విచారిస్తున్నారు. ఆధారాల కోసం ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో గర్భం దాల్చిన మహిళలు ఎవరు? ఇటీవల జన్మనిచ్చిన మహిళల వివరాలు ఏంటి? తదితర అన్ని అంశాలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

బాలికా సంరక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా ... నిత్యం వెలుగు చూస్తున్నదారుణాలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 318 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాలికా సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలు అని తెలిస్తే గర్భంలోని చంపేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడడం, లేదా పుట్టిన తరువాత వారిని ఎక్కడో విసిరి పారేయడం వంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అన్యం పుణ్యం ఎరుగని పసివాళ్ళను నిర్దాక్షిణ్యంగా పారవేసిన ఘటనలు పెరగడం సమాజంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తుంది.