భూమా అఖిల ప్రియకు బెయిల్ పిటీషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు జారీ: కీలకంగా మారిన ఆ రిపోర్ట్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ ఉదంతంలో మరో కీలక ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సికింద్రాబాద్ న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అనే ఉత్కంఠతకు తెర దించింది.
భూమా అఖిలప్రియ అరెస్టులో కొత్త కోణం: కింగ్ పిన్: భర్త భార్గవ్ రామ్ ఒక్కడే కాదు..అతని కుడిభుజం

బెయిల్ మంజూరుకు నిరాకరణ..
అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయడానికి సికింద్రాబాద్ న్యాయస్థానం నిరాకరించింది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను తోసి పుచ్చింది. మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి తరలించింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ ఉదంతంలో భూమా అఖిల ప్రియ ఏ1గా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె ఇదివరకే అరెస్ట్ అయ్యారు. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథం కింద తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె సికింద్రాబాద్ కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు.

కిడ్నాప్ గుట్టు తేల్చడానికి..
ఈ పిటీషన్ కొద్దిసేపటి కిందటే విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా భూమా అఖిలప్రియ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపించినట్లు తెలుస్తోంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారని, ఆమెకు చెవులు, ముక్కులో నుంచి రక్తం వస్తోందనే విషయాన్ని వివరించినట్లు చెబుతున్నారు. దీనిపై కౌంటర్ పిటీషన్ దాఖలు చేసిన పిటీషన్‌కు పోలీసుల తరఫు న్యాయవాది తన వాదలను వినిపించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారం భూముల క్రయ విక్రయాలు, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉండటం వల్ల బెయిల్ మంజూరు చేయొద్దని, కస్టడీకి అప్పగించాలంటూ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

ఉస్మానియా ఆసుపత్రి నివేదికపై..
అంతకుముందు- న్యాయస్థానం ఆదేశాల మేరకు అఫ్జల్ గంజ్ ఉస్మానియా ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలను చేయించారు. దీనికి సంబంధించిన డాక్టర్ల నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. భూమా అఖిలప్రియకు రాజకీయ పలుకుబడి ఉండటం, మాజీ మంత్రి కావడం వల్ల సాక్ష్యాదారులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పోలీసులు తమ వాదనలు న్యాయస్థానం ముందు వినిపించారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి..
మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి తరలించానికి అనుమతి ఇచ్చింది. నిజానికి పోలీసులు వారం రోజుల పాటు కస్టడీ కోరగా.. న్యాయస్థానం దాన్ని మూడు రోజులకు కుదించినట్లు చెబుతున్నారు. ప్రవీణ్ రావు, ఆయన సోదరులతో సంతకాలు చేసిన పత్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కిడ్నాప్‌లో ఎవరెవరు పాల్గొన్నారు? అజ్ఞాతంలో ఉన్న భర్త భార్గవ్ రామ్ గురించి మరిన్ని విషయాలపై ఈ మూడు రోజుల కస్టడీ సందర్భంగా ఆరా తీస్తారని సమాచారం.