టీఆర్ఎస్ వీడ్కోలు ప్రసంగంలా ఉంది.. బడ్జెట్ స్పీచ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ బడ్జెట్ గురించి విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల అంశం అగ్గిరాజేస్తోంది. తెలంగాణ బడ్జెట్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్య బద్దంగా లేవన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్‌ను ఇలా అవమాన పరచలేదన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం దిగజారుడుతనం అని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరుపుతున్నందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేయడం దారుణం అన్నారు.
పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో ఆందోళన చేసినా కేంద్రం సస్పెండ్ చేయలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా ఏనాడు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించలేదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం దారి తప్పినప్పుడు ప్రశ్నించే అధికారం ఎమ్మెల్యేలకు ఉంటుందన్నారు. ప్రశ్నించే గొంతు నొక్కేందుకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలిన కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ లో రాసిన సస్పెండ్ తీర్మానం ప్రకారం ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో ఈటల రాజేందర్‌ను చూడాల్సి వస్తుంది కాబట్టి సభ ప్రారంభమైన 10 నిమిషాలకే సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు ప్రశ్నించే అధికారం సభ్యులకు ఉంటుంది. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడుకోలు ప్రసంగంలా ఉంది. ఏడాది ముందే వీడుకోలు ప్రసంగంలా ఉందన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉస్మానియా ఆసుపత్రి మూతపడింది. బడ్జెట్ లో 130 లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పెడతానన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదో చెప్పాలి. విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఎంఎంటీఎస్ లో రాష్ట్ర వాటా ఇవ్వలేదని, కేంద్ర పథకాల నిధులు తమ నిధులుగా బడ్జెట్లో చూపారు. అప్పులు కూడా చెబితే బాగుండేది. అంబేద్కర్ పేరు తీసే అర్హత కూడా టీఆర్ఎస్కు లేదన్నారు.