రేపు హైదరాబాద్ కు కేంద్ర బృందం ... వరద నష్టం అంచనా కోసం
హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం స్తంభిస్తుంది. ఊహించని విధంగా అపార పంట నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఇక హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచేశాయి. ఇప్పటికీ పలు కాలనీలు నీట మునిగే ఉన్నాయి. ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు .ఇంకా కురుస్తున్న వర్షాలు భాగ్యనగర వాసుల జీవితాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నాయి.

హైదరాబాద్ లో పర్యటించనున్న కేంద్ర బృందం
హైదరాబాద్ లో భారీ వర్షాలపై కేంద్రం కూడా దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావాన్ని, జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రులతో మాట్లాడి తెలుసుకున్నారు . ఈ నేపథ్యంలోతెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుంది కేంద్ర బృందం . రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం, హైదరాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వెయ్యనుంది.
ఈనెల 13వ తేదీ నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వేలాది సంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

1350కోట్ల రూపాయలు తక్షణ సహాయం కోరిన రాష్ట్రం
పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న ప్రజలు అరాకొరా వసతులతో ఇబ్బంది పడుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఐదువేల కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేసిన రాష్ట్రప్రభుత్వం తక్షణ సహాయంగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి 550 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వరద బారిన పడిన ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహాయం కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది.

వరద నష్టాన్ని పరిశీలించటానికే రాష్ట్రానికి కేంద్ర బృందం అని చెప్పిన కేంద్ర మంత్రి
వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనం కారణంగా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగర ప్రజలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు . కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక పంపిన తర్వాత దానిని పరిశీలించేందుకు కేంద్ర బృందం హైదరాబాద్ కు రానున్నట్లు ఆయన చెప్పారు. మిగులు రాష్ట్రం ,ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ ముందు రాష్ట్ర ఖజానా నుండి నిధులను వరద సహాయానికి ఖర్చు చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ వాసులకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు .