దుబ్బాక షాకిచ్చినా... కాంగ్రెస్‌లో ఆగని అంతర్గత పోరు... రేవంత్-సీనియర్ల విభేదాలు మరోసారి బట్టబయలు..
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్మథనం మొదలైంది. ఒకరకంగా ఇక్కడ బీజేపీ గెలుపు టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం చేసింది. గులాబీ దండును ఎప్పటికైనా మట్టికరిపించేది తామేనని... తదుపరి ప్రభుత్వం తమదేనన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. నిన్నటిదాకా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ కిందకు నెట్టేయడంతో పార్టీ భవితవ్యంపై నేతల్లో ఆందోళన మొదలైంది. కొత్త నాయకత్వం తర్వాత బీజేపీ పుంజుకున్న తీరుపై ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు కూడా కొత్త నాయకత్వం వస్తేనే... రాష్ట్రంలో దూకుడు పెంచగలమని... లేదంటే భవిష్యత్ ప్రశ్నార్థకమేనన్న వాదన ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో టీకాంగ్రెస్ నేతల విభేదాలు మరోసారి బట్టబయలవడం చర్చనీయాంశంగా మారింది.

వీహెచ్ కామెంట్స్...
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పొలికేక సభలో కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి,సీనియర్ నేత వీహెచ్ మధ్య మాటల యుద్దం జరిగింది. స్టేజీపై మాట్లాడిన వీహెచ్... ఈసారి టీపీసీసీ చీఫ్ పదవిని బడుగు,బలహీన వర్గాలకే ఇవ్వాలన్నారు. అయితే వీహెచ్ కామెంట్లపై రేవంత్ అనుకూల వర్గం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఒక్కసారిగా సభలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు వినిపించాయి.

రేవంత్ రెడ్డి కౌంటర్...
వీహెచ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వవద్దని అన్నారు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్నవాళ్లకే టికెట్లు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత మాట్లాడిన రేవంత్ రెడ్డి... వీహెచ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. టీ కాంగ్రెస్‌లో డిపాజిట్లు కూడా రాని నాయకుల పెత్తనం ఇక సాగదని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పిందని వీహెచ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. అమ్ముడుపోయే నేతలను ఏరివేయాలన్నారు.ఎవరు ఎక్కడినుంచి వచ్చినా చిత్తశుద్దితో పార్టీ కోసం పనిచేసే నాయకులనే గెలిపిస్తారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఇకనైనా మేల్కొనాలని...
దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడంతో... ఇకనైనా మేల్కొనాల్సిన అవసరం ఉందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నాయకత్వ స్థానం నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ ఏనాడో ప్రకటించినా... ఇప్పటికీ ఆయన్నే కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దుబ్బాక ఫలితం చూశాక కూడా పార్టీ నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోకపోతే... భవిష్యత్తులో మరింత డ్యామేజ్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. బీజేపీలో ఎలాగైతే బండి సంజయ్ లాంటి దూకుడైన నేతకు పగ్గాలు అప్పగించారో... కాంగ్రెస్‌లోనూ ఛరిష్మా ఉన్న నేతకే పగ్గాలు అప్పగించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన రేవంత్ రెడ్డి పేరే టీపీసీసీ రేసులో ముందు వరుసలో ఉన్నప్పటికీ... సీనియర్లే ఆయనకు బ్రేకులు వేస్తున్నారన్న విమర్శలున్నాయి. రేవంత్‌కు పదవి రాకుండా అధిష్టానం వద్ద సీనియర్లే అడ్డుపడుతున్నారని గతంలో పలుమార్లు ఆరోపణలు వినిపించాయి.

ఇంకా కాలయాపనేనా...?
గతంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారికే టీపీసీసీ పదవి ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డికి ఆ పదవి దక్కవద్దన్న ఉద్దేశంతోనే సీనియర్లు ఇలాంటి ప్రతిపాదనలు చేశారన్న వాదన ఉంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని లీకులు రావడం... ఆ తర్వాత ఆ ఊసే లేకపోవడం గతంలో చాలాసార్లు జరిగింది. అయితే దుబ్బాకలో భంగపాటు తర్వాత.. కాంగ్రెస్‌కు దూకుడైన నాయకత్వం అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఒకరకంగా ఇది రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అంశం. అయితే కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లను కాదని రేవంత్‌కు పగ్గాలు అప్పగించే సాహసం చేస్తుందా...? అసలు టీపీసీసీ పదవిపై నిర్ణయం తీసుకుంటుందా..? లేక ఇంకా కాలయాపన చేస్తుందా అన్నది వేచి చూడాలి.