కేసీఆర్ ధ్యాస అదే.. మోడీపై కామెంట్స్ చేస్తే ఎందుకు స్పందించలే: రఘునందన్ రావు
బీజేపీ నేతలు.. ప్రధాని మోడీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు లైన్లోకి వచ్చారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో పొత్తుల కోసమే సీఎం కేసీఆర్ పాకులాడుతున్నారని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవకుండా కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ సానుభూతి చూపించారని ఎద్దేవా చేశారు. సోనియా, చంద్రబాబు.. మోడీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు రాలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.

ఇతర నేతల భాష గురించి కేసీఆర్ మాట్లాడటం..దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలసి పోటీచేయబోతున్నాయని ఆరోపించారు. కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. బైంసాలో హిందువులపై దాడులు జరిగితే మాట్లాడని కేసీఆర్.. మత రాజకీయాలు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పాతబస్తీలో హిందూ సమాజానికి జరిగిన నష్టంపై కేసీఆర్తో చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని రఘునాధన్ రావు సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని తాను సపోర్ట్ చేయడం లేదన్నారు. రాహుల్ పై వేసిన నిందను మాత్రం ఖండిస్తున్నానన్నారు. ఇదేం పద్దతి అలా మాట్లాడొచ్చా అంటూ కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయాల్లో అనుసరించాల్సిన పద్దతి కానే కాదన్నారు. ఉద్యమ సమయంలో తాను సోనియాపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనకు అలాంటి భాష రానే రాదన్నారు.