రుజువు చెయ్యండి.. రాజీనామా చేస్తా ... బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్
దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎం కేసీఆర్ కూడా నేరుగా రంగంలోకి దిగి దుబ్బాక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి అసత్య ప్రచారాలు చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందని ఆయన ఫైర్ అయ్యారు .
ఆ పని చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే ... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ లో కేటీఆర్

దుబ్బాకలో బీజేపీ అసత్య ప్రచారం ... ఫైర్ అయిన సీఎం కేసీఆర్
నిజాయితీ లేని ప్రభుత్వం బదనాం చేస్తారేమో కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల లో తొలి రైతు వేదికను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ బీజేపీ నాయకుల పై నిప్పులు చెరిగారు. పెన్షన్ల విషయంలో బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ మండిపడ్డారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 38,64,751 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఒక్కొక్కరికి 2016 రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.

పెన్షన్ ల విషయంలో బీజేపీ నేతలు చెప్తుంది పచ్చి అబద్ధం
కేంద్ర ప్రభుత్వం కేవలం 6.95 లక్షల మందికే పెన్షన్లు అందిస్తుందని అది కూడా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. బిజెపి నేతలు మాత్రం పింఛన్ల 1600రూపాయలు కేంద్రమే ఇస్తున్నట్లుగా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడిన కెసిఆర్, పెన్షన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధం అని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

బీజేపీ నేతలు పెన్షన్ల విషయంలో తాను చెప్పింది అవాస్తవం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా
తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం 11 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని అయితే కేంద్రం కేవలం 105 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తోందని కెసిఆర్ చెప్పారు. బిజెపి నేతలు ఎంతటి దుష్ప్రచారం చేసినప్పటికీ దుబ్బాక లో విజయం ఖాయమని కెసిఆర్ బల్లగుద్ది మరీ చెప్పారు. అసత్యాలు ప్రచారం చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరు అంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్ల విషయంలో బిజెపి నేతలు తాను చెప్పినది అవాస్తవం అని నిరూపిస్తే నిముషంలో రాజీనామా చేసి ఇంటికి వెళ్ళటానికి తాను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ సవాల్ విసిరారు.