బోనాలు షురూ: శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ఇవాల మొదలయ్యాయి. తెలంగాణ ప్రత్యేకతను చాటే బోనాల పండుగ జీవన వైవిద్యానికి, పర్యావరణ,ప్రకృతి ఆరాధనకు ప్రతీకంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. బోనాల పండగ సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో గురువారం నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.

బోనం
ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. తెలంగాణ అన్నీ వర్గాల సాంప్రదాయాలకు, రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.

ఆషాఢం మాసంలో
ఆషాఢం మాసం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. ఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. బోనం అనేది భోజనం అనే పదానికి వికృతి. మా బిడ్డల్ని , కుటుంబ సభ్యులని మాత్రమే కాకుండా ఊరుమొత్తం చల్లగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి భక్తితో బోనం సమర్పిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ... తమను చల్లగా చూడాలంటూ శక్తిస్వరూపాన్ని ఆరాధిస్తారు. తమ ఇంటికి ఎలాంటి ఆపదా రాకుండా, ఏ కష్టం లేకుండా చూడాలని ఆ అమ్మవారిని తలచుకున్నారు.

మట్టికుండలో
ఆషాఢమాసం రాగానే తెలంగాణ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకొంటారు. మట్టికుండలో అమ్మవారి కోసం వంట వండుతారు. చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారు చేస్తారు. బోనం ఉన్న కుండని పసుపుకుంకుమలతో అలంకరించి, వేపాకులు చుట్టి... దాని మీద జ్యోతిని వెలిగిస్తారు. ఇలా సిద్ధం చేసిన బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు