చలి పంజా: తెలంగాణలో చలి, వణుకుతున్న ఏజెన్సీ
తెలంగాణ రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్నాం కూడా టెంపరేచర్ తగ్గి.. చలి గాలులు వీయడంతో జనం వణుకుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది తుఫాను, అల్పపీడనం, వాయుగుండం వల్ల చలి తీవ్రత అంతగా లేదు. ఇటీవలే స్టార్ట్ అయి.. ఆ తర్వాత మెల్లగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు ఏజెన్సీ ఏరియాలో చలిపులికి గిరిజనులు వణుకుతున్నారు. చలికాలం ప్రారంభమైన రెండు నెలలు గడిచినా అంతగా చలి లేదు. వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది.

చలి పులి..
ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏజెన్సీ మండలాల్లోని గ్రామాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. అడవి ప్రాంతం కావడంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసే వారు పొగమంచుతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఉంది. వృద్ధులు, చిన్నారులు, చల్లటి గాలులతో ఇక్కట్లు పడుతున్నారు. చలి వల్ల వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉందని... జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మంచుకురిసే వేళలో
మంచు కురుస్తుండడంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది 163వ నెంబరు జాతీయ రహదారి మీద ఉదయం ఎనిమిది గంటలు దాటినా లైట్ల వెలుగులో ప్రయాణం చేస్తున్నారు. విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉదయాన్నే పనికి వెళ్లే వారు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి అయ్యే సరికి ఉష్ణోగ్రత పడిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. వెంకటాపురం వాజేడు ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాయంత్రం నాలుగు గంటలకే చలికోటు, చెవులకు వస్త్రాలను కప్పుకొని ప్రజలు బయట తిరగవలసి వస్తోంది.

స్వెటర్లు..
ఉన్ని వస్త్రాలు ధరించనిదే బయటకు రాలేకపోతున్నారు. గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ చలి వీడడం లేదు. రాత్రిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. గతంలో రాత్రి పదకొండు గంటల వరకూ జనసంచారం ఉండే వెంకటాపురంలో ఇప్పుడు 8 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల యితే కానీ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నీ జాగ్రత్తలు తీసుకొని
ఏజెన్సీలో కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోవడంతో గిరిజనులు వణుకుతున్నారు.చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు, ఉన్ని కోట్లు, రగ్గులు, జర్కిన్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. చలి మంటలు, కుంపట్ల వద్ద కాలక్షేపం చేస్తున్నారు. చలికి దగ్గు, జలుబు వంటి వ్యాధులు ప్రజలను బాధిస్తున్నాయి. కొంతమంది వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. ఉబ్బసం, ఆస్తమా, టీబీ రోగులు నానా అవస్థలు పడుతున్నారు. చలికాలంలో ఎక్కువుగా వృద్ధులు, పిల్లలు న్యుమోనియా వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. రక్తపోటు పెరిగి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారిపోతుంది. సోరియాసిస్ వంటి చర్మవ్యాధుల తీవ్రత ఎక్కువ అవుతాయి. మంచు ఎక్కువుగా పడడం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు ప్రజలను బాధిస్తున్నాయి.