telangana assembly elections 2018 lagadapati rajagopal warangal congress ktr తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 లగడపాటి రాజగోపాల్ వరంగల్ కాంగ్రెస్ కేటీఆర్
లగడపాటి తాజా సర్వే: గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు డౌటే... వరంగల్ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌వే
మంగళవారం లగడపాటి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తన సర్వే బయటపెట్టడంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. లగడపాటి సర్వే లంగా సర్వే అని అభివర్ణించారు కేసీఆర్. ఆ తర్వాత కొద్ది గంటలకే కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. లగడపాటి చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే సర్వే ఫలితాలను మార్చి చెప్పారంటూ చెబుతూనే.....నవంబర్ 20 లగడపాటి కేటీఆర్‌ల మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ కూడా ట్విటర్ వేదికగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సంభాషణలు బయటకు రావడంతో లగడపాటి కూడా రియాక్ట్ అయ్యారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్ విడుదల చేసిన సంభాషణలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అది తన సంభాషణ కాదని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా
తాను ఎవరి ఒత్తిడితోను సర్వే ఫలితాలు మార్చలేదని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని చెప్పిన లగడపాటి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలిపితే ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదన్నారు. బరిలో నిలిపిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆనాడే కేటీఆర్‌కు చెప్పినట్లు చెప్పిన లగడపాటి.... వీలైతే అభ్యర్థులను కూడా మార్చాలని సూచించినట్లు చెప్పారు. ఓటు బదిలీపై కూడా కేటీఆర్‌తో తాను చర్చించినట్లు చెప్పిన లగడపాటి... ఓ 37 నియోజకవర్గాలు కేటీఆర్ తనకు ఇచ్చి సర్వే చేయించాల్సిందిగా కోరారని లగడపాటి చెప్పారు. ఆ 37 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉందని గుర్తుచేశారు. సర్వే రిపోర్టును పంపుతానని చెప్పగా కేటీఆర్ తన ఈమెయిల్ ఐడీ ఇచ్చినట్లు లగడపాటి చెప్పారు. తాను నాడు చేసిన ఫలితాలు మహాకూటమి ఏర్పడక ముందు అని .... కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, కమ్యూనిస్టులు కలిశాకా చేసిన సర్వేలపై ఫలితాలు తారుమారు అయ్యాయని లగడపాటి చెప్పారు. తాజాగా బుధవారం ఉదయం వరంగల్ జిల్లాకు సంబంధించిన సర్వే ఫలితాలు వచ్చినట్లు చెప్పిన లగడపాటి... వరంగల్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నట్లు తెలిపారు.

గజ్వేల్‌లో కేసీఆర్‌కు గడ్డుకాలమే
అంతేకాదు అక్టోబర్‌లో తాను గజ్వేల్ వెళ్లిన సమయంలో తన కారును పోలీసులు ఆపారని లగడపాటి చెప్పారు. తనను చూసి కానిస్టేబుల్ గుర్తుపట్టారని ఆ సమయంలో నలుగురు కానిస్టేబుళ్లను గజ్వేల్‌లో ఎవరు గెలుస్తారని అడిగినప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతారని ధీమా వ్యక్తం చేశారని అయితే కేసీఆర్ పేరును మాత్రం ప్రస్తావించేందుకు ఇష్టపడలేదని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అంతేకాదు తాను కేసీఆర్ ఓడిపోవడం అనేది జరగదని ఆ పోలీసులతో చెప్పినప్పుడు డిసెంబర్ 11న మీరు చూడండి అంటూ వారు తనతో చెప్పినట్లు లగడపాటి వెల్లడించారు. దీనిబట్టి చూస్తూ కేసీఆర్‌కు కూడా గజ్వేల్‌లో పరిస్థితి కష్టంగా ఉన్నట్లే తెలుస్తోందని అన్నారు.

ఆదిలాబాద్‌లో గిరిజనులు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు
రెండు పార్టీల మధ్య పోరు పోటాపోటీగా ఉన్న సమయంలోనే కొన్ని అంశాలు తెరపైకి వస్తాయని చెప్పిన లగడపాటి... తన సర్వేలో కూడా ఇదే జరిగిందన్నారు. కేసీఆర్ దళితులకు మూడెకరాలు పంచుతానని మాట తప్పారని... దళితుడిని సీఎం చేస్తానని అక్కడా మాట తప్పారని కొన్ని దళిత వర్గాలు చెప్పినట్లు లగడపాటి వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పై కూడా ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్లు చెప్పారు. ఇక గిరిజనులంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లు చెప్పిన లగడపాటి... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానాలు ప్రజా కూటమి వశమైయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాదు డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చేదాక అర్హులైనవారికి రూ. 50వేలు ముందుగానే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో ప్రజలు కాస్త ఆలోచిస్తున్నారని వెల్లడించారు. ఇక మైనార్టీలు గులాబీ పార్టీకి దూరమవుతున్నారని చెప్పారు.

పదవులు కాదు వ్యక్తిత్వం ముఖ్యం
నాడు టీఆర్ఎస్కు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెబితే కేటీఆర్ తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని నేడు వ్యతిరేకంగా వచ్చేసరికి తన క్రెడిబులిటీని ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు లగడపాటి రాజగోపాల్.తనకు పదవులు ముఖ్యం కాదన్న లగడపాటి వ్యక్తత్వం ముఖ్యం అని చెప్పారు. కేటీఆర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని గుర్తుచేశారు లగడపాటి. ట్విటర్లో కేటీఆర్ పోస్టులను చూసిన తర్వాతే స్పందించాల్సి వస్తోందన్నారు లగడపాటి. నవంబర్ 20 తర్వాత చాలా ఫలితాలు వచ్చాయని అయితే వాటిని షేర్ చేయలేదని స్పష్టం చేశారు లగడపాటి. అయితే ఎన్నికలకు ఇంకా 48 గంటలు సమయం ఉన్నందున ఏమైనా జరిగే అవకాశం ఉందని తాను ఏమి మాంత్రికుడిని కాదని చెప్పారు.