బిగ్‌బాస్ కోసం ఎంతకైనా తెగిస్తారా.. కింగ్‌పై వీహెచ్ ఫైరయ్యారుగా..!
హైదరాబాద్ : బిగ్‌బాస్ షో నిర్వహణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. హోస్ట్ నాగార్జునపై సైతం ఓ రేంజ్లో గరమయ్యారు. సికింద్రాబాద్ మహాంకాళి బోనాల జాతర సందర్భంగా మీడియాతో మాట్లాడిన హన్మంతన్న బిగ్‌బాస్ షో పై ఓ రేంజ్లో ఫైర్ కావడం చర్చానీయాంశమైంది.
తెలంగాణ సంప్రదాయాలను కాపాడేలా మహిళలు ఇక్కడ బోనాలు తీస్తుంటే.. అన్నపూర్ణ స్టూడియోలో మాత్రం మహిళలను కించపరిచే షో ప్రారంభించారని మండిపడ్డారు. కేవలం డబ్బులు సంపాదించడానికే బిగ్‌బాస్ కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా ఆ షో నిర్వహించడం సరికాదని విరుచుకుపడ్డారు.

వీహెచ్ గరం గరం.. బిగ్‌బాస్‌పై ఆరోపణల పర్వం
ఆదివారం నాడు జరిగిన లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు హన్మంతన్న. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ షో పై నిప్పులు చెరిగారు. ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సినీ నటుడు అక్కినేని నాగార్జునపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. మంచి మంచి సినిమాలు తీసిన నీకు ఈ షో ఎందుకయ్యా అంటూ ఎద్దేవా చేశారు.
నాగార్జున మంచి సినిమాలు తీస్తారు. ఆయన నటించిన అన్నమయ్య, భక్తరామదాసు సినిమాలు చూశాను. ఎందుకయ్యా ఈ బిగ్‌బాస్ షో ఒప్పుకున్నావంటూ నిలదీశారు వీహెచ్. మహిళలను కించపరిచేటట్లు ఏంటా షో అని ప్రశ్నించారు. అలాంటి పనికిమాలిన షో కు పోలీసోళ్లు ఎట్లా పర్మిషన్ ఇస్తారంటూ కడిగిపారేశారు. శ్వేతారెడ్డి అనే జర్నలిస్ట్ కంప్లైంట్ చేస్తే కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు.
లష్కర్ రంగం : ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు.. కానీ.. అమ్మోరు అలా ఎందుకు చెప్పినట్లో..!

సంప్రదాయాలను కించపరుస్తూ.. డబ్బుల కోసమే ఇదంతా..!
డబ్బుల కోసం ఏమైనా చేస్తారా.. సంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించరా అంటూ నాగార్జునకు ప్రశ్నల వర్షం సంధించారు. డబ్బులే కావాలి మీకు.. దానికోసం ఆడవాళ్లతో మీరు ఏ ఆటలైనా ఆడిపిస్తారంటూ ఫైరయ్యారు. ఇక్కడనేమో మహాంకాళి జాతరలో మహిళలను గౌరవిస్తుంటే మరోపక్క అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ అంటూ మహిళలను కించపరిచే షో చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదని.. సంప్రదాయాలను దెబ్బతీయొద్దని హితవు పలికారు.
నాగార్జున ఇది మంచి పద్దతి కాదు.. మీకు మంచి పేరుంది.. భక్తరామదాసు లాంటి సినిమాలు తీసి మంచిపేరు తెచ్చుకున్నావు.. ఎందుకయ్యా నీకు ఈ షో అంటూ ప్రశ్నించారు. మీకు రేటింగులు గావాలే.. ఇలాంటి పనికిమాలిన షో ల ద్వారా అడ్వర్టయిజ్మెంట్ల వల్ల వచ్చే ఆదాయం గావాలే.. అంతేగానీ సంప్రదాయాలు ఎట్లా పోతే మీకేందంటూ గరమయ్యారు. అయినా పోలీసోళ్లు ఇలాంటి వాటికి పర్మిషన్ ఎలా ఇస్తారని విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. బిగ్‌బాస్ ఆపకుంటే..!
సీఎం కేసీఆర్ గారు మీ కొడుకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు గానీ ఇలాంటి బిగ్‌బాస్ షో ల సంప్రదాయం తెలంగాణ కల్చర్ కు సరిపోదు.. తెలంగాణ కల్చర్ వేరు.. అన్నాతమ్ముడు, బావబామ్మర్ది, అత్తకోడలు సంప్రదాయం మనది.. ఈ షో లో మహిళలను కించపరుస్తున్నారు. నిర్వాహకులు ఏం చెబితే అది చేయాల్నట.. అంటే ఏమన్నట్లు.. ఇలాంటి షోలతో డబ్బులు గావాల్నా మీకు నాగార్జున అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసోళ్లు బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ఆపేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ సంప్రదాయంలో భాగంగా బోనాలు ఎత్తుకుని ఆడపడుచులు ఒకవైపు వస్తుంటే.. మరోవైపు ఇదే రోజు బిగ్‌బాస్ షో స్టార్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోర్టులో ఓ పక్క కేసు నడుస్తుంటే మరోవైపు ఇలా షో కొనసాగించడం సరికాదన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న బిగ్‌బాస్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంప్రదాయాన్ని మీరు నాశనం చేస్తున్నారని నాగార్జునపై ధ్వజమెత్తారు. మనది ఫారిన్ కంట్రీ కాదు.. సంప్రదాయ కల్చర్ మనది.. లేదు మీరు ఇట్లానే చేస్తామంటే.. ఇక నాలుగు రోజుల తర్వాత మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.