ఇదీ జగ్గారెడ్డి లెక్క: రేవంత్ అనుకూల మీడియా, కోవర్టుగా ముద్ర వేస్తుందట..
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కోవర్టుగా ముద్ర వేస్తున్నారని కామెంట్ చేశారు. రేవంత్‌రెడ్డి అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకరు కోసమో, ఒకరు చెప్తేనో తాను పని చేయనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు బాలేదన్నారు. అంతర్గతంగా అభిప్రాయం చెప్పే పరిస్థితి కాంగ్రెస్‌లో లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకుముందు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం జగ్గారెడ్డిని తమ ముందుకు పిలుస్తామని ప్రకటిస్తే.. ఆయన కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రేవంత్ వస్తేనే తానూ వస్తానని ప్రకటించారు. దీన్నిబట్టి జగ్గారెడ్డి స్పష్టమైన వైఖరితోనే ఉన్నారని రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ పుంజుకోకుండా చూడడమే లక్ష్యంగా పని చేస్తున్నారని అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. తన అభిప్రాయాలను పార్టీ వేదికలపై మాత్రమే చెబుతాను.. మీడియా ముందు చెప్పనని ప్రకటించి నెల రోజులు కాకుండానే మళ్లీ మీడియాకెక్కడం వెనుక జగ్గారెడ్డి ఎజెండా ఏంటో అర్ధం అవుతోందని అంటున్నారు.

కేసీఆర్ నియమంచిన వ్యూహకర్త సునీల్ ఎత్తుగడలలో భాగంగానే జగ్గారెడ్డి ఎపిసోడ్ నడుస్తోందనే అనుమానం వ్యక్తం చేశారు. సునీల్ టీమ్ క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచి బీజేపీని పికప్ అయ్యేలా చేయాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఓటు బ్యాంక్ బీజేపీకి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోంది. బీజేపీ పికప్ కాకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్‌కు మళ్లుతాయి. అప్పుడు టీఆర్ఎస్కు ఓటమి తప్పదని సునీల్ టీమ్ ఓ రిపోర్ట్ ఇచ్చిందని సమాచారం.
బీజేపీని పికప్ చేస్తూ.. ఇంకోవైపు కాంగ్రెస్ దూకుడుకి కళ్లెం వేయాలనే వ్యూహంతోనే కేసీఆర్ వ్యూహం పన్నారని అంటున్నారు. బండి సంజయ్‌ను పైకి లేపడం ద్వారా అటు ఈటలకు ఇటు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టొచ్చనేది గులాబీ బాస్ ప్లాన్ గా అనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్‌లో అటు కోవర్ట్ రాజకీయాలు ఇటు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు నడుస్తున్నాయని పరిస్థితిని చూస్తే అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.