తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్నటికన్నా 536 ఎక్కువ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల తీవ్రత ఎక్కువ అవుతుంది. తాజాగా 2983 కొత్త కేసులు వచ్చాయి. కరోనా సోకిన ఇద్దరు చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1206 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7లక్షల 14వేల 639కు చేరింది. ఇదే సమయంలో మొత్తం మరణాల సంఖ్య 4062కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్నటి కన్నా 536 ఎక్కువ కేసులు వచ్చాయి. 24 గంటల్లో 2706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. లక్ష 7 వేల 904 మందికి కరోనా పరీక్షలు చేశారు.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలంటూ తెలంగాణ సర్కార్ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అలాగే సోషల్ డిస్టెన్స్, మాస్కుల నిబంధనలను రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు సూచించింది.

కరోనా నియంత్రణపై కేబినెట్ చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించగా... పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ కేసులపై విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది హైకోర్టు. ఇటు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన స్వల్ప లక్షణాలు రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.