కరోనా కరాళ నృత్యం.. అప్రమత్తత తప్పనిసరి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వార్నింగ్
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్రంగా ఉంది. కానీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ ధృవీకరించారు. ఒకే రోజు రెండు లక్షల కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోందని చెప్పారు. భవిష్యత్‌లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
కరోనా వైరస్ దెబ్బకు అగ్ర దేశాలు కూడా అల్లాడుతున్నాయని చెప్పారు. వాటితో పోల్చితే తక్కువ వసతులు ఉన్న మనం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలి నుంచి విస్తరించే స్థాయికి వైరస్ చేరుకుందని హెచ్చరించారు. తొలి వేవ్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని, ఇదే సమయంలో మహమ్మారి మరింత బలాన్ని పుంజుకుందని శ్రీనివాస్ తెలిపారు.

వైరస్ వేగంగా విస్తరిస్తోందని శ్రీనివాస్ చెప్పారు. ఫిబ్రవరి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యిందని తెలిపారు. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో బెడ్లు, మందులు, ఆక్సిజన్‌కు కొరత లేదని తెలిపారు. 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు.
గతంలో కరోనా సోకిన వ్యక్తిని ఇంట్లో ఐసొలేట్ చేస్తే సరిపోయేదని... ఇప్పుడు ఇంట్లో రోగిని గుర్తించేలోగా కుటుంబమంతా వైరస్ సోకుతోందని శ్రీనివాస్ చెప్పారు. 15 రోజుల్లోనే పాజిటివిటీ రేటు డబుల్ అయిందని తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.