coronavirus ఎఫెక్ట్: హోళీ సంబరాలను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశంలోనూ ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో 28 కరోనావైరస్ పాజిటివ్ కేసులు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోనూ కరోనావైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా కలకలం: రహేజా ఐటీ పార్క్ ఖాళీ, ఉద్యోగులు ఇక వర్క్ ఫ్రమ్ హోం, గాంధీకి అనుమానితుల తాకిడి

పెరుగుతున్న కరోనా అనుమానితుల సంఖ్య
ఇప్పటికే హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కరోనావైరస్ బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరో ఇద్దరికి కూడా కరోనా వైరస్ ఉన్నట్లు అనుమానం కలగడంతో వారి రక్త నమూనాలను పుణెకు పంపించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరో 45 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనావైరస్ నెగిటివ్ అని తేలడంతో వారిని డిశ్చార్జ్ చేశారు.

హోళీపై నిషేధం విధించాలంటూ..
ఈ నేపథ్యంలోనే హోళీ పండగ రావడంతో పండగను జరుపుకోవాలా? వద్దా? అనే సందేహంలో ఉండిపోయారు ప్రజలు. కాగా, కరోనావైరస్ వ్యాప్తిచెందుతున్న దృష్ట్యా హోళీ పండగ జరుపుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో తాజాగా ఓ పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ మణికొండకు చెందిన గంపా సిద్ధలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.

మార్చి 9న హోళీ.. చైనా రంగులు..
మార్చి 9, 10 తేదీల్లో హోళీ సంబరాలు జరగనున్నాయని ఆమె హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. హోలీ సండగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి అవకాశం ఉందని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకలను నిషేధించాలని రిట్ పిటిషన్లో కోరారు. వేడుకలను నిషేధించడం ద్వారా ప్రజలను వైరస్ బారినపడకుండా కాపాడుకోవచ్చని సిద్ధలక్ష్మి తెలిపారు. చైనా నుంచి దిగుమతి అయిన రంగులను కూడా ఉపయోగించరాదంటూ పలువురు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం.

హోళీ వేడుకలకు మోడీ, షాలు దూరం
కాగా, కరోనావైరస్ దేశంలో విజృంభిస్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు చేరడం ద్వారా కరోనావైరస్ తొందరగా వ్యాపించే అవకాశం ఉండటంతో వేడుకలకు దూరంగా ఉంటేనే మంచిదని ప్రజలకు పిలుపునిచ్చారు.