కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు.. మంత్రులకు బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. సాగర్ ఉప ఎన్నిక ముగిశాక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులో ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఎన్నికలు జరిగే ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే ఈ అంశంపై సూచనలు చేశారు.
నాగార్జున సాగర్ ఎన్నికలు పూర్తవగానే అక్కడి నుంచి నేరుగా సొంత జిల్లాలకు వెళ్లి కార్పొరేషన్ ఎన్నికల పనిలో ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటికే పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్ల అంశం, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది. వార్డుల విభజన కూడా పూర్తి చేసింది.

గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలక మండలి గడువు మార్చి 21తో ముగిసింది. సిద్ధిపేట కార్పొరేషన్ల పాలక మండలి గడవు ఈనెల 15తో పూర్తవుతోంది.