• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వాసాల‌మ‌ర్రికి ద‌ళిత బంధు నిధులు విడుద‌ల‌: కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం, దళితుల సంబరాలు

|

హైదరాబాద్: దళితబంధు నిధులు విడుదలయ్యాయి. దత్తత గ్రామం వాసాలమర్రి దళితులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బుధవారం ఇచ్చిన హామీ మేరకు గురువారం ఆ గ్రామానికి దళిత బంధు నిధులు విడుదల చేశారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్లు విడుదల చేశారు.

వాసాలమర్రిలో దళితబంధు సంబరాలు

వాసాలమర్రిలో దళితబంధు సంబరాలు


ఈ మేరకు నిధుల విడుదలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కగా, దళిత బంధు నిధులు విడుదల కావడంతో వాసాలమర్రి దళితులు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. తమ ఇళ్లల్లోకి వచ్చి తమ కష్టనష్టాలను తెలుసుకుని ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.

వాసాలమర్రిలో ఇంటింటికీ తిరిగిన కేసీఆర్

వాసాలమర్రిలో ఇంటింటికీ తిరిగిన కేసీఆర్

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరి యోగక్షేమాలను, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బందు పథకం గురించి తెలుసా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు? దళిత బంధు డబ్బలు వస్తే ఏం చేద్దాం అని అనుకున్నారు అని సీఎం ప్రశ్నించారు? కొంత మంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని కొందరు ట్రాక్టర్ లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు తెలిపారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ మీకు పెన్షన్ వస్తున్నదా? అని ఆరా తీసారు. పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా వుంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు. దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇండ్లలో ఇంటిలోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బంధు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు.

బీడీ చేసేటోళ్ల ఇంట్లోనే చదువుకున్నానంటూ కేసీఆర్

బీడీ చేసేటోళ్ల ఇంట్లోనే చదువుకున్నానంటూ కేసీఆర్


దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు పడవద్దని సీఎం వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా'' అని సీఎం వాఖ్యానించారు.

వాసాలమర్రి ప్రజల కష్టాలు తీర్చిన కేసీఆర్

వాసాలమర్రి ప్రజల కష్టాలు తీర్చిన కేసీఆర్


ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎంకు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళిత బంధు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా దళిత నాయకుడు ‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల'' అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరిని పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా? రైతు బంధు డబ్బులు వస్తున్నయా? ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధుల దగ్గర వెళ్ళి పెన్షన్ లో కొంత ఏమైనా పక్కకు పోదుపు చేసుకుంటున్నరా? అని ఆరా తీసారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా వున్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

  Spl Interview with bjp leader Enugu Ravindar Reddy on Etala Padayatra
  వాసాలమర్రిలో అన్ని కుటుంబాలకు సాయం: కేసీఆర్

  వాసాలమర్రిలో అన్ని కుటుంబాలకు సాయం: కేసీఆర్


  దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు.
  సీఎం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు గ్రామ కాలనీల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు కాలినడకన పర్యటించారు. ముఖ్యమంత్రి వెంట శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునితా మహెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్న, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సీఎం ఓస్డీ దేశపతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, కవులు, రచయితలు మిట్టపల్లి సురెందర్, సాయిచంద్, అంబటి వెంకన్న అభినయ్ శ్రీనివాస్, కోదారి శ్రీనివాస్, బూర సతీష్, మానుకోట ప్రసాద్, బాబు, శివ, భిక్షపతి, తదితరులు ఉన్నారు.

  English summary
  Dalitha bandhu funds release to vasalamarri village.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X