గ్రేటర్ వార్ .. వివాదాస్పద ప్రసంగాలను పరిశీలిస్తున్నాం, చర్యలు తప్పవని డీజీపీ వార్నింగ్
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రసంగాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. విద్వేషాలు రెచ్చగొడుతున్న నేతలపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో డీజీపీ చేసిన ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
గ్రేటర్ వార్: అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఎర్రగడ్డ స్థల ప్రభావం..స్పందించాల్సిన అవసరం లేదన్న విజయశాంతి

రోహింగ్యాలపై 62 కేసులు నమోదు చేశామన్న డీజీపీ
సర్జికల్ స్ట్రైక్ చేస్తామని వ్యాఖ్యలు చేసిన నేతలపై కేసులు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు రోహింగ్యాలపై 62 కేసులు నమోదు చేశామని చెప్పిన డిజిపి శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఇక ఓయూ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజెపి యువ ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు మహేందర్ రెడ్డి .

గత ఆరేళ్లలో హైదరాబాద్ లో ఎన్నడూ మతఘర్షణలు లేవు
ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల పై యాభై కేసులు నమోదు చేసినట్లు గా వెల్లడించారు.
గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ లో పాల్గొనాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం కోసం పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని డిజిపి, హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.

మత ఘర్షణలను సృష్టించే ప్లాన్ ... సమాచారం ఉందన్న డీజీపీ
జిహెచ్ఎంసి ఎన్నికల ఆసరాగా చేసుకుని మత విద్వేషాలు మత ఘర్షణలు సృష్టించేందుకు చేసినట్లుగా తమకు సమాచారం వచ్చిందని, అలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఇక సోషల్ మీడియా పోలీసులపై కూడా పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి పేర్కొన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న రూమర్స్ ను నమ్మొద్దని ఆయన సూచించారు.

బీజేపీ ఎంపీ తేజశ్వి సూర్యపై కేసు నమోదు .. రాజకీయ వర్గాల్లో చర్చ
ఎక్కడ ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించే విధంగా టీమ్స్ సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రజలు పోలీసులతో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ లలో 51,500 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. అయితే డీజీపీ ఇచ్చిన వార్నింగ్ బిజెపి నేతలు చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యల నేపథ్యంలోనే అని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది .